ఈటలకు గ్యారెంటీ కావాలట

రెండు+రెండు= 4 అని లెక్కల్లో కరెక్టే. కానీ రాజకీయాల్లో ప్రతిసారి 2+2=4 అవుతుందని చెప్పేందుకు లేదు. కొన్నిసార్లు జీరో కూడా కావచ్చు. రాజకీయాలే అంత ఎవరిని ఎప్పుడు అందలం ఎక్కిస్తుందో, ఎవరిని ఎందుకు అదఃపాతాళంలోకి తొక్కేస్తుందో ఎవరు చెప్పలేరు. ఇప్పుడింతా దేనికంటే తెలంగాణా రాజకీయాల్లో ఈ రోజుకి హాట్ టాపిక్ ఎవరయ్యా అంటే మాజీమంత్రి ఈటల రాజేందర్ అనే చెప్పాలి. ఢిల్లీకి వెళ్ళి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన వార్తలు హాటు హాటుగా మారాయి.

వారం తర్వాత ఫైనల్ గా నియోజకవర్గం హుజూరాబాద్ లో మద్దతుదారులతో మాట్లాడి కమలం కండువా కప్పుకుంటారనే ప్రచారం పెరిగిపోతోంది. క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే బహుశా బీజేపీలో చేరటానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తోంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిందేమంటే బీజేపీలో చేరాలని అనుకుంటున్న ఈటల ఓ విషయంలో నడ్డాను గ్యారెంటీ అడగారట.

రాజకీయాలు ఏమైనా కుక్కరా ? లేకపోతే రెఫ్రిజిరేటరా ? గ్యారెంటీకార్డు ఇవ్వటానికి. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఈరోజు ఏమిటనేదే ప్రధానం. ఎందుకంటే రేపు ఏమి జరుగుతుందో ఎవ్వరు అంచనా వేయలేరు కాబట్టే. తాను బీజేపీలో చేరిన తర్వాత భవిష్యత్తులో బీజేపీ-టీఆర్ఎస్ ఒకటవ్వవని గ్యారెంటీ ఏమిటని మాజీమంత్రి నడ్డాను అడగారట. టీఆర్ఎస్-బీజేపీ ఒకటే అని జరుగుతున్న ప్రచారాన్ని నడ్డా దృష్టిలో ఈటల పెట్టారట.

అందుకు నడ్డా కూడా గ్యారెంటీ ఇచ్చేశారట. తెలంగాణాలో అధికారంలోకి రాబోయేది తమ పార్టీనే కాబట్టి ఫికర్ వద్దని భరోసా ఇచ్చారట. పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీపై రాజీలేని పోరాటం చేస్తున్నట్లే తెలంగాణాలో కూడా అదే పోరాటం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారట. ఈటల గ్యారెంటీ అడగటం, నడ్డా ఇచ్చేయటం అంతా బాగానే ఉంది.

అయినా ఏ పార్టీతో పెట్టుకోవాలి ? ఏ పార్టీని దూరం పెట్టేయాలన్న నిర్ణయం నడ్డా చేతిలో లేదన్న విషయం యావత్ దేశమంతా తెలుసు. పొత్తులు, చిత్తులు అన్నీ నరేంద్రమోడి, అమిత్ షా లే డిసైడ్ చేస్తారు. జస్ట్ ఆదేశాలను ఫాలో అవ్వటమే నడ్డా చేయగలిగింది. రేపు అవసరమైతే తెలంగాణాలో కేసీయార్ తో పొత్తు పెట్టుకోవాలంటే మోడి ఏమాత్రం మొహమాటపడరు. అదే జరిగితే మరి గ్యారెంటీ తీసుకున్న ఈటల ఏమంటారో ?