#Absentcm.. శుక్రవారం సాయంత్రం నుంచి ట్విట్టర్లో పెద్ద ఎత్తున ట్రెండ్ అయిన హ్యాష్ ట్యాగ్. దేశవ్యాప్తంగా ఈ హ్యాష్ ట్యాగ్ మీద ట్వీట్లు పడ్డాయి. ఇంతకీ ఎవరా సీఎం.. ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ కావడం వెనుక కథ ఏంటి అంటే..
యస్ తుపాను పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో.. దీనిపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆ రెండు రాష్ట్రాల్లో పర్యటించారు. ముందుగా ఒడిషాకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పార్టీలు వేరని చూడకుండా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ పద్ధతిగా ఈ సమావేశానికి హాజరయ్యారు.
తుపాను నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశం ముగించుకున్నాక పీఎం మోడీ.. కోల్‌కతాకు బయల్దేరారు. అక్కడికి చేరుకుని సమావేశం కోసం ఎంచుకున్న కార్యాలయానికి కూడా చేరుకున్నారు. మామూలుగా ప్రధాని వస్తున్నాడంటే ముందే ముఖ్యమంత్రి అక్కడికి చేరుకుని స్వాగతం పలుకుతుంటారు. ఐతే ప్రధాని పేరెత్తితే మండిపోయే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అలా చేస్తుందన్న అంచనాలు ఎవరికీ లేవు. కానీ ఆమె ప్రధాని వచ్చాక కూడా సమావేశానికి రాలేదు. ఆయన్ని అరగంట పాటు వేచి చూసేలా చేసింది. తాను రాకపోయినా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులనైనా పంపాల్సింది. కానీ అదీ చేయలేదు.
ప్రధాని, కేంద్రం నియమించిన గవర్నర్, ఇంకా ఒకరో ఇద్దరో అధికారులు మాత్రమ మీటింగ్‌కు హాజరయ్యారు. అరగంట పాటు మోడీ ఎదురు చూశాక అక్కడికి వచ్చిన మమత.. ఒక నివేదిక ఇచ్చేసి వెంటనే వెళ్లిపోయారు. వేరే ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నందున ఆలస్యమైందని, మళ్లీ ముఖ్యమైన పనులుండటం వల్ల వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించారు.
ఎంత రాజకీయ వైరం ఉన్నప్పటికీ ప్రధానికి కాస్తయినా గౌరవం ఇవ్వాల్సిందని, ఇలా కావాలనే సమావేశానికి ఆలస్యంగా రావడం, ప్రధానికి మొక్కుబడిగా ఒక నివేదిక ఇచ్చి వెళ్లిపోవడం మోడీని అవమానించడమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే మోడీ మద్దతుదారులు, మమత వ్యతిరేకులు #Absentcm హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. ఐతే ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా తమ సమస్యలు వివరించబోతే మోడీ మమతకు అవకాశమే ఇవ్వలేదని.. దానికి ఇది ప్రతీకారం అని.. భాజపాయేతర ముఖ్యమంత్రులతో మోడీ వ్యవహరించే తీరు దృష్ట్యా మమత ఇలా చేయడం సరైందే అన్న వాదన మరోవైపు నుంచి వినిపిస్తోంది.