రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న టీడీపీకి చాలా నియోజకవర్గాల్లో సరైన నాయకత్వం లేని సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఒక్కసారిగా అధికారం కోల్పోయిన టీడీపీలో చాలామంది నాయకులు సైడ్ అయిపోయారు. పలువురు నాయకులు పార్టీ నుంచి జంప్ కొట్టేశారు. దీంతో రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో టీడీపీకి సరైన నాయకులు లేరు. ఇలా ఇన్‌చార్జ్‌లు లేని నియోజకవర్గాలు 30 + ఉన్నాయి. ఈ క్రమంలోనే కీలకమైన విశాఖపట్నం జిల్లాలో విశాఖ సౌత్, భీమిలి నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌లు కూడా లేరు.
గత ఎన్నికల్లో విశాఖ సౌత్ నుంచి వాసుపల్లి గణేశ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. టీడీపీ తరుపున గెలిచిన గణేశ్, మొన్న ఆ మధ్య వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో సౌత్‌లో టీడీపీకి సరైన నాయకత్వం లేకుండా పోయింది. గణేశ్ టీడీపీని వీడాక చంద్రబాబు సౌత్‌లో ఇన్‌చార్జ్‌ని కూడా పెట్టలేదు. అటు కంచుకోటగా ఉన్న భీమిలి నియోజకవర్గంలో టీడీపీది అదే పరిస్థితి.
2019 ఎన్నికల్లో భీమిలి నుంచి సబ్బం హరి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సబ్బం ఓడిపోయాక భీమిలి వైపు పెద్దగా వెళ్లలేదు. అయితే ఇటీవల ఆయన కరోనాతో మరణించారు. దీంతో భీమిలిలో మరో నాయకుడుని పెట్టాల్సిన అవసరముంది. భీమిలి, విశాఖ సౌత్ నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్‌చార్జ్‌లని పెడితే మరింత బలం పుంజుకునే అవకాశముంటుంది. ప్రస్తుతానికి ఈ రెండు నియోజకవర్గాల బాధ్యతలనీ విశాఖ పార్లమెంట్ ఇన్‌చార్జ్, బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ చూసుకుంటున్నారని తెలుస్తోంది.
ఆయనే విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఈ రెండు నియోజకవర్గాలు విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. ఇటీవల జరిగిన విశాఖ కార్పొరేషన్ ఎన్నికలో రెండు నియోజకవర్గాల్లో నాయకులకు అండగా ఉన్నారు. అసలు సౌత్‌లో గణేశ్ వెళ్ళగానే, ఆ నియోజకవర్గంలో నాయకులతో సమావేశమై భరత్, పార్టీ మరీ వీక్ అవ్వకుండా చూసుకున్నారు. అటు భీమిలి నాయకులతో కూడా టచ్‌లో ఉన్నారని తెలిసింది. అందుకే కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ మంచి ఫలితాలే సాధించింది. కాబట్టి ఈ రెండు చోట్ల ఇన్‌చార్జ్‌లని పెడితే పార్టీ బలోపేతం అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates