లాక్ డౌన్ వేళ ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రజలకు సాయం చేస్తున్నారు. సోనూ సూద్ స్ఫూర్తితో ఎంతోమంది సెలబ్రెటీలు తమ వంతుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మాజీ క్రికెటర్, ఎంపీ అయిన గౌతమ్ గంభీర్ సైతం ఢిల్లీలో తన పేరిట నెలకొల్పిన ఫౌండేషన్ ద్వారా సేవ చేస్తున్నాడు. అత్యవసర స్థితిలో ఉన్న కొవిడ్ రోగులకు అతను మందులను ఉచితంగా సరఫరా చేస్తుండటం విశేషం.
ఐతే అతను చేస్తున్న పనిని ఢిల్లీ హైకోర్టు తప్పుబట్టడం గమనార్హం. గంభీర్ సమాజానికి అపకారం చేస్తున్నాడంటూ అతడి మీద కోర్టు మండిపడింది. ఇందుక్కారణం.. మార్కెట్లో అందుబాటులో ఉన్న మందుల్లో పెద్ద ఎత్తున గంభీర్ కొనేయడమే. కొవిడ్ చికిత్సలో కీలకంగా ఉంటున్న ఫాబీ ఫ్లూ మందులకు ఢిల్లీలో బాగా కొరత ఏర్పడింది. ఐతే గంభీర్ ఏకంగా 2,345 స్క్రిప్టుల ఫాబీ ఫ్లూ మందులను కొని స్టాక్ పెట్టేశాడు.
తనను సంప్రదించిన వాళ్లకు గంభీర్ ఉచితంగానే ఫాబీ ఫ్లూ మందులను సరఫరా చేస్తున్నప్పటికీ.. అందరూ అతణ్ని చేరుకునే పరిస్థితి ఉండదన్నది వాస్తవం. ఈ విషయమై ఎవరో కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు గంభీర్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. దాని వల్ల సమాజానికి నష్టం కలుగుతోందని.. మార్కెట్లో ఔషదాల కొరత ఏర్పడుతోందని కోర్టు వ్యాఖ్యానించింది.
బయట మార్కెట్లో తీవ్ర కొరత ఉన్న మందులను అంత భారీ సంఖ్యలో ఎలా కొనుగోలు చేశాడో విచారణ జరపాలని హైకోర్టు.. ఢిల్లీ ఔషధ నియంత్రణ సంస్థ అధికారిని ఆదేశించడం గమనార్హం. ఈ సంగతలా ఉంచితే కొవిడ్ సమయంలో గంభీర్ చేస్తున్న సేవ మాత్రం ప్రశంసలు అందుకుంటోంది. మందులు, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు బాధితులకు అవసరమైన వాటిని అతను ఉచితంగా అందజేస్తున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates