మరో పెద్ద రాష్ట్రం మోడీ చేజార‌నుందా ?

బీజేపీకి ఇటీవ‌ల జాతీయ రాజ‌కీయాల్లో వ‌రుస షాకులు త‌గులుతున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేర‌ళ‌, బెంగాల్‌, త‌మిళ‌నాడులో బీజేపీకి మామూలు ఎదురు దెబ్బ‌త‌గ‌ల్లేదు. ముఖ్యంగా బెంగాల్ ప‌రాజ‌యాన్ని బీజేపీ నేత‌లు ఇప్ప‌ట‌కీ జీర్ణించుకోలేక‌పోతున్నారు. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో బెంగాల్లో కేవ‌లం మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు గెలిచిన బీజేపీ మొన్న ఎన్నిక‌ల‌కు ముందు అధికారం మాదే అని నానా హ‌డావిడి చేసేసింది. చివ‌ర‌కు ఫ‌లితాల్లో 75 సీట్ల‌కు ప‌రిమితం అయ్యింది. ఇక త‌మిళ‌నాడు, కేర‌ళ‌లో ఆ పార్టీ గురించి చెప్పుకోవ‌డానికేం లేదు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మూడో సారి గెలిచి ఢిల్లీ పీఠంపై హ్యాట్రిక్ కొట్టాల‌ని క‌ల‌లు కంటోన్న మోడీ – అమిత్ షా ద్వయానికి పెద్ద బ‌లం యూపీ.

యూపీలో గ‌త రెండు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ బీజేపీ తిరుగులేని విజ‌యం సాధించింది. మోడీ ఢిల్లీ పీఠంపై కూర్చోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం యూపీయే అని చెప్పాలి. అయితే యూపీలో ప్ర‌స్తుతం రాజ‌కీయ వాతావ‌ర‌ణం మారుతోంది. బిహార్‌లో తేజ‌స్వి యాద‌వ్ బీజేపీకి ఎంత షాక్ ఇచ్చాడో ఇప్పుడు యూపీలో అఖిలేష్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో చాప‌కింద నీరులా అంతే షాక్ ఇవ్వ‌బోతున్నాడ‌ని జాతీయ రాజ‌కీయ, మీడియా వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీకి యూపీ పీఠం నిల‌బెట్టుకోవ‌డం అంత వీజీకాద‌నే తెలుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో బీజేపీ చావుత‌ప్పి క‌న్నులొట్ట‌బోయిన చందంగా స్థానాలు గెలుచుకుంది. పైగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ప్రాథినిత్యం వ‌హిస్తోన్న వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గంలో అయితే ఎస్పీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది.

ఈ ఫ‌లితాలు వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు శుభ సంకేతాలుగా ఎస్పీ నేత‌లు భావిస్తున్నారు. సీఎం యోగి పాల‌న‌లో రాష్ట్రంలో పెరిగిపోతోన్న హింస‌, క్రైం రేటు, అత్యాచారాలు, దోపిడీలు ఒక మైన‌స్ అయితే.. తీవ్ర‌మైన నిరుద్యోగ రేటు, క‌రోనా ఎఫెక్ట్ ఇవ‌న్నీ యోగి పాల‌న‌కు పెద్ద మ‌చ్చ‌గా మిగిలిపోయాయి. ఎన్నో ఆశ‌ల‌తో బీజేపీకి అధికారం క‌ట్ట‌బెడితే ఆశ‌లు అడియాస‌లు చేస్తార‌ని ఊహించ‌లేద‌ని యూపీ గ్రామీణ జ‌నం వాపోతోన్న ప‌రిస్థితి. పైగా బీజేపీకి పట్టున్న ప్రాంతాల్లోనూ సమాజ్ వాదీ పార్టీ ఆధిక్యత కనపర్చడం అఖిలేష్ యాదవ్ లో మరింత ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి.

మొత్తం 3,050 స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీజేపీ కేవలం 599 స్థానాలకే పరిమితమయింది. సమాజ్ వాదీ పార్టీ 790, బహుజన్ సమాజ్ పార్టీ 354, కాంగ్రెస్ 60 స్థానాల్లో విజయం సాధించాయి. ఇక అఖిలేష్‌పై ప్ర‌జ‌ల్లో సానుభూతి, త‌గ్గుతోన్న మోడీ, షా క్రేజ్ యూపీ జ‌నాల వైఖ‌రిలో మార్పున‌కు కార‌ణ‌మ‌య్యాయి. పైగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఒంట‌రిగానే పోటీ చేస్తాన‌ని ఇప్ప‌టికే అఖిలేష్ ప్ర‌క‌టించారు. ఏదేమైనా బీజేపీ ఏ యూపీని చూసి విర్ర‌వీగుతోందో ? అదే యూపీ ప్ర‌జ‌లు ఈ సారి బీజేపీకి ప‌ట్టం క‌ట్టేందుకు అంత సుముఖంగా లేన‌ట్టే తెలుస్తోంది. ఇదే ప‌రిస్థితి సాధార‌ణ ఎన్నిక‌ల్లో రిపీట్ అయితే బీజేపీ నుంచి మ‌రో పెద్ద రాష్ట్రం చేజార‌డం ఖాయం.