స్టార్లెందుకు.. ముఖ్య‌మంత్రే రంగంలోకి దిగాడు


త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టినప్ప‌టి నుంచి త‌న‌దైన శైలిలో నిర్ణ‌యాలు తీసుకుంటూ అంద‌రి మెప్పూ పొందుతున్నాడు డీఎంకే అధినేత స్టాలిన్. కొవిడ్ నియంత్ర‌ణ దిశ‌గా లాక్ డౌన్ స‌హా కొన్ని క‌ఠిన చ‌ర్య‌ల‌కు తోడు.. వైద్య స‌దుపాయాలు పెంచ‌డానికి ఆయ‌న యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం ప్ర‌శంస‌లందుకుంది. ఇక ముఖ్య‌మంత్రి అయిన వెంట‌నే ప్ర‌తిప‌క్ష నేత ప‌న్నీర్ సెల్వంను మ‌ర్యాద‌పూర్వ‌కంగా ఇంటికెళ్లి క‌లుసుకోవ‌డం.. ఓ ప్ర‌భుత్వ క‌మిటీలో ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌కు చోటు ఇవ్వ‌డం లాంటి నిర్ణ‌యాలు కూడా ఆక‌ట్టుకున్నాయి.

మున్ముందు ఎలా ఉంటుందో ఏమో కానీ.. ప్ర‌స్తుతానికి స్టాలిన్ పాల‌నా ప‌ర‌మైన నిర్ణ‌యాల‌న్నీ ఆక‌ట్టుకుంటున్నాయి. ఆయ‌న మంచి పాల‌కుడిగా, అంద‌రివాడిగా ముద్ర వేయించుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. తాజాగా మ‌రో ఆక‌ర్ష‌ణీయ‌మైన ప‌నితో స్టాలిన్ వార్త‌ల్లో వ్య‌క్తి అయ్యారు.

క‌రోనాపై జ‌నాల్లో అవ‌గాహ‌న పెంచ‌డానికి స్టాలిన్ నేరుగా రంగంలోకి దిగారు. మామూలుగా ఏవైనా ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌పై, జ‌నాల్లో అవ‌గాహ‌న పెంపొందించే విష‌యాల‌పై ప్ర‌క‌ట‌న‌లు చేయాల్సి వ‌స్తే సినీ తార‌ల వైపే చూస్తారు. ఐతే క‌రోనా నియంత్ర‌ణ దిశ‌గా మాస్కు ధ‌రించ‌డం స‌హా క‌రోనా ఇత‌ర జాగ్ర‌త్త‌ల‌పై ప్ర‌భుత్వం రూపొందించిన ఓ ప్ర‌క‌ట‌న‌లో స్వ‌యంగా త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రే క‌నిపించారు. మాస్కు ప్రాధాన్య‌త‌ను చెబుతూ.. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఎలా మెలగాలో చ‌క్క‌గా వివ‌రిస్తూ ఆయ‌న ఈ వీడియోలో జ‌నాల‌కు సందేశం ఇచ్చారు.

సామాన్యులంద‌రికీ అర్థ‌మ‌య్యేలా పూర్తిగా త‌మిళంలోనే మాట్లాడారు స్టాలిన్. మాస్కు అన‌కుండా దానికి కూడా ఒక త‌మిళ ప‌దాన్నే స్టాలిన్ వాడ‌టం విశేషం. ఇలా ఓ ముఖ్య‌మంత్రే క‌రోనాపై జాగ్ర‌త్త‌లు చెబుతూ ప్ర‌క‌ట‌న చేయ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇది జ‌నాలకు మంచి సంకేతాలు ఇస్తుంద‌ని, స్టాలిన్‌ను మిగ‌తా నేత‌లు అనుస‌రించాల‌ని అంటున్నారు.