మూడు రోజుల క్రితం అరెస్టయిన వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు సొంత సామాజికవర్గంలోనే ఒంటరైపోయారు. గెలిచిన పార్టీ నేతలతోనే గొడవలు పెట్టుకోవటం వల్ల, ప్రభుత్వంతో పాటు జగన్మోహన్ రెడ్డిపై నోటకొచ్చినట్లు మాట్లాడటం వల్ల అధికారపార్టీ నేతలకు దూరమైపోయారు. ఇక అరెస్టు తర్వాత మరీ విచిత్రమైన పరిస్ధితులు చోటు చేసుకుంటున్నాయి.
ఇక్కడ చెప్పుకోవాల్సిన విచిత్రం ఏమిటంటే అధికారపార్టీ ఎంపికి ప్రతిపక్షాల నేతలందరు మద్దతుగా నిలబడటం. తిరుగుబాటు ఎంపి వైఖరి తప్పా ? ఒప్పా ? అన్న విషయాన్ని పక్కనపెట్టేసి ఏకపక్షంగా అందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడబలుకున్నట్లుగా మాట్లాడుతున్నారు. సరే రాజకీయాలన్నాక ఇలాగే ఉంటాయని సరిపెట్టుకుందాం కాసేపు.
అయితే ఇంతటి క్లిష్టపరిస్ధితుల్లో కృష్ణంరాజుకు మద్దతుగా నిలబడుతుందని అనుకున్న సొంత సామాజికవర్గం కూడా వదిలేసింది. రఘురామ వైఖరితో, అరెస్టుతో సామాజికవర్గానికి ఎలాంటి సంబంధం లేదని క్షత్రియ సామాజికవర్గ సమాఖ్య స్పష్టంగా ప్రకటించింది. భీమవరం, గణపవరం, తణుకు, ఉండి, తిరుపతి లాంటి పట్టణాల్లోని క్షత్రియ సంఘాలు రఘురామ వ్యవహారానికి సామాజికవర్గానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు అత్యంత సన్నిహితంగా ఉన్న రాజకీయ కుటుంబాల ప్రముఖులు కూడా ఇప్పటివరకు నోరెత్తలేదు. మాజీ ఎంపిలు కనుమూరు బాపిరాజు, గోకరాజు గంగరాజు, కృష్ణంరాజు, ప్రముఖ పారిశ్రామికవేత్త సిరీస్ రాజు కుటుంబం ఎవరు కూడా ఎంపికి మద్దతుగా మాట్లాడలేదు. అంటే క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు చూసిన తర్వాత ఎంపి సామిజికవర్గంలో ఒంటరైపోయినట్లు అర్ధమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates