బ‌ద్వేల్ లో.. టీడీపీ ప‌వ‌ర్ ఎంత ?

ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌పలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం బ‌ద్వేల్‌. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి కేటాయించిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వ‌రుస‌గా వైసీపీ విజ‌యం సాధిస్తోంది. 2014లో తిరువీధి జ‌య‌రాములు, 2019లో డాక్ట‌ర్ వెంక‌ట సుబ్బ‌య్య‌లు విజ‌యం ద‌క్కించుకున్నారు. 2009లోనూ ఇక్క‌డ కాంగ్రెస్ నుంచి క‌మ‌ల‌మ్మ గెలిచారు. అయితే.. ఇటీవ‌ల ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంక‌ట‌ సుబ్బ‌య్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ క్ర‌మంలో మ‌రో నాలుగు మాసాల్లో ఇక్క‌డ ఉప ఎన్నిక రానుంది. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డి రాజ‌కీయాలు వేడెక్కాయి. వైసీపీ ఎవ‌రికి టికెట్ ఇస్తుంద‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. ఇక్క‌డ ప్ర‌తి ఎన్నిక‌లోనూ.. పార్టీలు అభ్య‌ర్థుల‌ను మారుస్తున్నాయి.

ప్ర‌స్తుతం అధికార పార్టీ హ‌వా .. జిల్లా వ్యాప్తంగా ఉంది. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా కావ‌డంతో ఇక్క‌డ అనేక అభివృద్ధి ప‌నులు చేప‌ట్టారు. అంతేకాదు.. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కూడా దూకుడుగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. అదే స‌మ‌యంలో ఎంపీలు అవినాష్‌, మిధున్ రెడ్డిలు.. కూడా యాక్టివ్‌గా ఉన్నారు. దీంతో జిల్లాలో దాదాపు టీడీపీ మాట‌, జెండా కూడా క‌నిపించ‌డం లేదు. వినిపించ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన మాజీ మంత్రులు ఆదినారాయ‌ణ రెడ్డి, రామ‌సుబ్బారెడ్డి లాంటి వాళ్లు కూడా పార్టీ మారిపోయారు. స‌తీష్‌రెడ్డిది అదే బాట‌.

ఇంకా చెప్పాలంటే జిల్లా టీడీపీలో కీల‌క నేత‌లు కాడి కింద‌ప‌డేయ‌డ‌మో లేదా మౌనంగా ఉండ‌డ‌మో చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఉప ఎన్నిక‌లో టీడీపీ ఎలాంటి వ్యూహం అనుస‌రించ‌బోతోంది? అనేది ఆస‌క్తిగా మారింది. వైసీపీ త‌ర‌ఫున ఎవ‌రిని నిల‌బెట్టినా.. గెలిపించుకునేందుకు అనేక మంది నాయ‌కులు ఉన్నారు. కానీ, టీడీపీ త‌ర‌ఫున నాయ‌కులు నిల‌బ‌డే వారు ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. పైగా.. గ‌డిచిన రెండు ఎన్నిక‌ల్లోనూ ఒక‌రినే ఇక్క‌డ నిల‌బెట్టిన ప‌రిస్థితి లేదు. పైగా.. స్థిర‌మైన నేత చేతిలో పార్టీ ప‌గ్గాలు పెట్ట‌లేదు. దీంతో ఎవ‌రికి టికెట్ కేటాయించిన‌ప్ప‌టికీ.. నిల‌బ‌డేందుకు స‌ద‌రు నేత‌ను గెలిపించుకునేందుకు మ‌ళ్లీ చంద్ర‌బాబు రంగంలోకి దిగాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

గ‌త రెండు ఎన్నిక‌ల్లో 2014లో విజ‌య జ్యోతి పోటీ చేసి.. 68800 ఓట్లు వ‌చ్చాయి. ఇక‌, గ‌త 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ఓబులాపురం రాజ‌శేఖ‌ర్‌.. 50 వేల పైచిలుకు ఓట్ల‌కు ప‌రిమిత‌య్యారు. సో.. ఈ రెండు ఎన్నిక‌ల్లోనూ ఓట్లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న ఉప పోరులో టీడీపీకి మ‌రింత‌గా ఓటు బ్యాంకు త‌గ్గుతుందా? లేక‌.. పెరుగుతుందా ? అనేది కూడా ఆస‌క్తిగా మారింది. టీడీపీకి ఎలాగూ గెలిచే స్కోప్ లేక‌పోయినా ఓట్లు పెరిగితేనే పెద్ద సంచ‌ల‌నం. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై రాష్ట్ర వ్యాప్తంగా పోరు చేస్తున్నా.. సీఎం సొంత జిల్లాలో మాత్రం ఆత ర‌హా వేడి క‌నిపించ‌ని నేప‌థ్యంలో టీడీపీ ఎలాంటి వ్యూహం అనుస‌రిస్తుందోన‌నే ప్ర‌శ్న తెర‌మీద‌కి వ‌చ్చింది.