తెలంగాణలో లాక్‌డౌన్.. కేసీఆర్ వ్యూహం


కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి నేపథ్యంలో దేశంలో మెజారిటీ రాష్ట్రాలు కొన్ని వారాల ముందు నుంచే లాక్ డౌన్ బాట పట్టాయి. దక్షిణాదిన తెలుగు రాష్ట్రాలు మినహా అన్ని స్టేట్స్‌లోనూ లాక్ డౌన్ పెట్టేశారు. ఏపీలో ఉదయం 6 నుంచి 12 వరకు మినహా కర్ఫ్యూ పెట్టడంతో దాదాపు లాక్ డౌన్ అమలు చేసినట్లే అయింది. కానీ చుట్టూ ఉన్న రాష్ట్రాలన్నీ కరోనాను అదుపు చేయడానికి లాక్ డౌన్ మినహా మార్గం లేదని భావిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా అడుగులు వేయడానికి సంకోచించింది.

గత ఏడాది లాక్ డౌన్ దెబ్బకు ఆర్థికంగా గట్టి దెబ్బ తగలడం, ఈ షరతుల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్‌ పట్ల వ్యతిరేకత ప్రదర్శించారు. కానీ ఉన్నట్లుండి కేబినెట్ మీటింగ్ పెట్టి లాక్ డౌన్ అనౌన్స్ చేశారు. ఉదయం 6 నుంచి 10 వరకు, అంటే నాలుగు గంటలు మినహాయిస్తే పది రోజుల పాటు లాక్ డౌన్ అమలవుతుందని తేల్చేశారు.

ఐతే కేసీఆర్ ఇన్నాళ్లూ లాక్ డౌన్ విషయంలో ఆలస్యం చేయడానికి, ఉన్నట్లుండి ఇప్పుడు మనసు మార్చుకోవడానికి కారణం లేకపోలేదు. ఇది వ్యూహాత్మక నిర్ణయమే అని భావిస్తున్నారు. దేశంలో సగటు కరోనా పాజిటివ్ రేటు 21 శాతం ఉండగా.. తెలంగాణలో అది 9 శాతానికి పరిమితం. దేశంలో అతి తక్కువ పాజిటివ్ రేటు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. పరీక్షలు తక్కువ చేస్తుండటం వల్లో లేదంటే ఫలితాల గురించి సరైన సమాచారం ఇవ్వట్లేదా అన్నది తెలియదు కానీ.. అధికారిక లెక్కల్లో తెలంగాణలో అయితే పాజిటివిటీ రేటు తక్కువగా ఉన్న మాట వాస్తవం.

అదే సమయంలో ఏపీలో పాజిటివిటీ రేటు 23 శాతంగా ఉండటం గమనార్హం. రాష్ట్రాలను కాకుండా జిల్లాలను యూనిట్‌గా పరిగణనలోకి తీసుకుంటున్న ఐసీఎంఆర్.. పాజిటివిటీ రేటు 10 శాతానికి మించితే ఆరు నుంచి పది వారాల పాటు లాక్ డౌన్ పెట్టాల్సిందే అంటోంది. ప్రస్తుతం తెలంగాణలో 9 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు ఇంకొక్క శాతం పెరిగితే కేంద్రం 6-10 వారాల లాక్‌డౌన్‌ పెట్టాలని ఒత్తిడి తేవచ్చు. కాబట్టి ఎందుకైనా మంచిదని కేసీఆర్ ముందే లాక్ డౌన్ పెట్టేశారు. దీని వల్ల పాజిటివిటీ రేటు ఇంకా తగ్గుతుందని, పది శాతానికి మించదని.. కాబట్టి పది రోజుల తర్వాత లాక్ డౌన్ ఎత్తేయొచ్చని.. లేదా ఇంకొన్ని రోజులు మాత్రమే పొడిగించి దీర్ఘకాలిక లాక్ డౌన్ లేకుండా చూసుకోవచ్చని వ్యూహాత్మకంగా నిర్ణయాన్ని ప్రకటించినట్లు భావిస్తున్నారు.