తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్న సంకేతాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహానికి గురై మంత్రివర్గం నుంచి గెంటేయబడ్డ ఈటల రాజేందర్… తన భవిష్యత్తు బాటను పక్కాగానే ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ఈ బాట నిర్మాణంపై ఈటల జెట్ స్పీడుతో సాగుతున్న వైనం కూడా చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. ఇందుకు నిదర్శనంగా మంగళవారం రాత్రి టీపీసీసీ చీఫ్ మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయిన ఈటల.. బుధవారం తెల్లారగట్లనే రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్)తో భేటీ అయ్యారు. భట్టితో 40 నిమిషాలు భేటీ వేసిన ఈటల… డీఎస్ తో ఏకంగా గంటన్నరకు పైగా చర్చలు జరిపారు.
ఈ చర్చల్లో ఏం మాట్లాడుకున్నారన్న విషయాలు అంత క్లారిటీగా బయటకు రాకున్నా.. టీఆర్ఎస్ నుంచి ఎలాగూ గెంటేయబడ్డ ఈటల ఆ పార్టీతో కలిసి సాగే పరిస్థితి లేదు. మరి టీఆర్ఎస్ నుంచి గెంటేస్తే… రాజకీయాలు మానుకుని ఈటల ఇంట్లో కూర్చోలేరు కదా.మరేం చేస్తారు? టీఆర్ఎస్ పై తనదైన శైలిలో పోరు సాగించేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నిర్మిస్తారు. ఇప్పుడు ఈటల చేస్తున్న పని కూడా అదే.
ఇప్పటికే టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో టచ్ లోకి వెళ్లిన ఈటల… భట్టి, డీఎస్ లతో భేటీలు నిర్వహించడం చూస్తుంటే… తాను అనుకున్న మార్గంలో చాలా స్పీడుగానే వెళుతున్నారనే చెప్పాలి.
ఈటలతో కలిసి పనిచేసేందుకు కొండా విశ్వేశ్వరరెడ్డి ఇప్పటికే రెడీ అయిపోయారు. ఇక టీపీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న యువ సంచలనం రేవంత్ రెడ్డి కూడా ఈటలతో కలిసి సాగేందుకు సిద్ధంగానే ఉన్నట్లుగా కొండా చెప్పేశారు. తాజాగా భట్టితో నేరుగా ఈటల భేటీ వేయడం… ఆ వెంటనే డీఎస్ ఇంటికి వెళ్లి చర్చలు జరపడం చూస్తుంటే… టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ వేదిక ఈటల ఆధ్వర్యంలోనే రూపుదిద్దుకుంటోందని, ఆ పని కూడా చాలా వేగంగానే జరుగుతోందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates