విజయవాడకు చెందిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు సీఎంవో నుంచి ఫోన్ వచ్చిందట! ‘ఇలా చేస్తే.. ఎలా? ఇప్పటి వరకు ప్రభుత్వం చేసిందంతా కూడా మట్టిపాలై పోయిందిగా..!’ అని సున్నితంగా ఓ కీలక సలహాదారుడు.. మందలించినట్టు విజయవాడ రాజకీయాల్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రస్తుతం కరోనా సమయంలో ప్రభుత్వం వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసి.. 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ ఇస్తోంది. ఈ క్రమంలో విజయవాడ నడిబొడ్డున ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ అనేక సార్లు పర్యటించి.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే షేక్ రాజా ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు.
ఇది విజయవాడ ప్రజలకు అన్ని మూలల నుంచి వచ్చే వారికి ఎంతో అందుబాటులో ఉండేది. అంతేకాదు.. ప్రజలకు ఇక్కడ కొంత సేపు వెయిట్ చేసేందుకు గుడారాలను కూడా ఏర్పాటు చేశారు. భౌతిక దూరం పాటించేలా క్యూలైన్లు కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఎక్కువ మందికి గత పది రోజులుగా ఇక్కడ వ్యాక్సిన్ వేస్తున్నారు. అయితే.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌రావు.. రెండు రోజుల కిందట ఇక్కడ పర్యటించి.. వ్యాక్సిన్ కేంద్రం ఇక్కడ బాగోలేదు.. అంటూ.. హుటాహుటిన తన నియోజకవర్గం పరిధిలోని కొత్తపేటలో ఉన్న కేబీఎన్ కళాశాలకు మార్చేశారు.
అయితే.. ఈ కళాశాల పేరు గొప్పదే అయినా.. మౌలిక సదుపాయాలు అంతంత మాత్రం. కూర్చునేందుకు కానీ, ఓ వంద మంది వస్తే.. నిలబడేందుకు కానీ ఎలాంటి సదుపాయాలు లేవు. దీంతో ఇక్కడ ప్రజలు ఒకరిపై ఒకరు కూర్చునే పరిస్థితి వచ్చింది. నిన్న ఏకంగా.. కరోనా వ్యాక్సినేషన్‌కు వచ్చిన వారి మధ్య తోపులాటలు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో ఈ వార్తలు పెద్దగా రావడంతో ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లింది. దీంతో దీనిపై సీరియస్ అయిన సీఎం.. ఇదేం పద్ధతి.. అసలు మంత్రులను వ్యాక్సిన్ విషయంలో ఎవరు జోక్యం చేసుకోమన్నారు? అంటూ.. సలహాదారుతో ఫోన్ చేయించి మరీ .. వాయించేశారట. దీంతో ఇప్పుడు మంత్రిగారు కిక్కురు మనడంలేదని అంటున్నారు.