హైకోర్టు ఆదేశాలు కూడా లెక్కచేయటం లేదా ?

అవును క్షేత్రస్ధాయి పరిస్ధితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కరోనా వైరస్ చికిత్స కోసం ఏపి నుండి హైదరాబాద్ కు వస్తున్న రోగులను తెలంగాణా సరిహద్దుల్లో పోలీసులు నిలిపేస్తున్నారు. సోమవారం నుండి కర్నూలు, కృష్ణాజిల్లా, గుంటూరు సరిహద్దుల్లో పోలీసులు ప్రత్యేకించి డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఏపిలోని ఏ ప్రాంతంనుండి తెలంగాణాలోకి ప్రవేశించాలనా పోలీసులు అడ్డుకుంటున్నారు. దాంతో చెక్ పోస్టులు, టోల్ గేట్ల దగ్గర పెద్ద గోల జరుగుతోంది.

ఈ విషయాన్ని మీడియాలో తెలుసుకున్న హైకోర్టు సూమోటోగా కేసు టేకప్ చేసింది. తెలంగాణాలో పనిచేస్తున్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమీషనర్లను కోర్టుకు పిలిపించింది. వైద్యం కోసం వస్తున్న రోగులను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీసింది. రోగులను ఏ అధికారాలతో సరిహద్దుల్లో అడ్డుకుంటున్నారో చెప్పాలంటు సూటిగా ప్రశ్నించింది. కోర్టడిగిన ప్రశ్నలకు పోలీసులు నీళ్ళు నమిలారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణా-ఏపికి హైదరాబాద్ పదేళ్ళు ఉమ్మడి రాజధాని. ఈ చట్ట ప్రకారం మరో మూడేళ్ళు హైదరాబాద్ పై ఏపి జనాలకు కూడా చట్టబద్దమైన హక్కులున్నాయి. పైగా వైద్యావసరాల కోసం ఎవరు ఏ ప్రాంతంలో అయినా చికిత్సలు చేయించుకోవచ్చని సుప్రింకోర్టు కూడా తాజాగా ఆదేశాలిచ్చింది. అయితే ఎవరెన్ని ఆదేశాలిచ్చినా పోలీసులు మాత్రం లెక్కచేయటంలేదు.

ఒకవైపు విచారణలో హైకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మంగళవారం పోలీసు ఉన్నతాధికారులు తలొంచుకున్నారు. అయితే క్షేత్రస్ధాయిలో మాత్రం అంబులెన్సులను అనుమతించేది లేదని తేల్చిచెప్పేశారు. మంగళవారం కూడా తెలంగాణాలోకి రోగులను అనుమతించకుండా సరిహద్దుల్లోనే నిలిపేశారు. అంటే హైకోర్టు ఆదేశాలను కూడా పోలీసులు పట్టించుకోవటం లేదన్న విషయం అర్ధమైపోయింది.

నిజానికి పోలీసుల ఓవర్ యాక్షన్ కు ప్రభుత్వ పెద్దల ఆదేశాలే కారణమని తెలిసిపోతోంది. పోలీసులు తమంతట తాముగా రోగులను సరిహద్దుల్లో నిలపటంలేదు. ఏపి నుండి కరోనా వైరస్ రోగులు తెలంగాణాలోకి ప్రత్యేకించి హైదరాబాద్ కు వచ్చేస్తే ఇక్కడ ఇబ్బందులు మొదలవుతాయన్న ఆందోళనతోనే తెరవెనుక నుండి ఆదేశాలను జారీచేశారు. దాంతో పోలీసులు తమకు అందిన మౌఖిక ఆదేశాలను క్షేత్రస్ధాయిలో అమలు చేస్తున్నారు.