టీడీపీలో ఆ ఫైర్‌బ్రాండ్ సైలెన్స్‌… ఏం జ‌రిగింది ?

టీడీపీలో ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్‌, ప్ర‌భుత్వ మాజీ విప్ కూన ర‌వికుమార్‌.. కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయారు. పార్టీలో ఇటీవ‌ల కాలంలో ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఆయ‌న వాయిస్ కూడా వినిపించ‌డం లేదు. నిజానికి వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక కూడా కూన వ‌రుస‌గా దూకుడుగా ఏదో ఒక విమ‌ర్శ చేస్తూ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. వైసీపీ నేత‌ల‌ను, ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేయ‌డంలో ముందున్నారు. నిత్యం మీడియా ముందుకు వ‌చ్చి సంచ‌ల‌న కామెంట్ల‌తో పాలిటిక్స్‌ను వేడెక్కించారు. ఈ క్ర‌మంలోనే కూన అధికార పార్టీకి టార్గెట్ అవ్వ‌డం, ఆయ‌న‌పై నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేయ‌డం… ఆయ‌న కొద్ది రోజులు ప‌రారీలో ఉండి..ఆ త‌ర్వాత స‌డెన్‌గా ప్ర‌త్య‌క్ష‌మ‌వుతూ ఉండ‌డం కామ‌న్‌గా జ‌రుగుతూ వ‌స్తోంది. అయితే.. ఇటీవ‌ల కాలంలో మాత్రం ఆయ‌న సైలెంట్ అయ్యారు. దీనికి రీజ‌నేంటి ? అనేది ఆస‌క్తిగా మారింది.

ప్ర‌స్తుత ఏపీ స్పీక‌ర్ త‌మ్మినేనికి స్వ‌యానా మేన‌ల్లుడు అయిన కూన 2014లో ఆయ‌న్నే ఓడించారు. ఆ క్ర‌మంలోనే ఆయ‌న‌కు చంద్ర‌బాబు విప్ పోస్ట్ ఇచ్చారు. టీడీపీలో రెండో చింత‌మ‌నేనిగా ఆయ‌న బిరుదు పొందారు. కూన దూకుడు రాజ‌కీయాల్లో పెట్టింది పేరు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయినా కూడా ఆయ‌న దూకుడుగానే ఉన్నారు. జిల్లా టీడీపీలో ఉద్దండులు అయిన రాజ‌కీయ నేత‌లు సైలెంట్ అవ్వడం… ఇటు బాబు స‌పోర్ట్‌తో పాటు పార్ల‌మెంట‌రీ పార్టీ జిల్లా అధ్య‌క్షుడి అవ‌కాశం ఇవ్వడంతో కూన దూకుడుకు అడ్డు అదుపు లేదు.

ఇటు నియోజ‌క‌వ‌ర్గంలోనే కాకుండా అటు జిల్లాలో పార్టీని ఉరుకులు పరుగులు పెట్టించారు. పార్టీ కార్య‌క్ర‌మాల్లో దూకుడుగా ఉండ‌డంతో పాటు జిల్లా అధికారుల‌ను సైతం బెంబేలెత్తించారు. ఈ క్ర‌మంలోనే అనేకానేక కేసులు, బెయిళ్లు ఎదుర్కోక త‌ప్ప‌లేదు. అదే దూకుడు ఇప్పుడు కూన‌లో కాన‌రావ‌డం లేదు. టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా.. అచ్చెన్నా యుడు.. బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుంచి కూన పెద్ద‌గా యాక్టివ్‌గా ఉండ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇద్ద‌రిదీ ఒకే జిల్లా అయిన‌ప్ప‌టికీ.. కూన‌పై ప్ర‌భుత్వం క‌క్ష పూరితంగా కేసులు న‌మోదు చేస్తోంద‌న్న విష‌యంలో అచ్చెన్న స‌రిగా రియాక్ట్ అవ‌డం లేద‌ని.. జిల్లాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇప్ప‌టికే ఒక‌సారి.. ర‌వి కుమార్ అజ్ఞాతంలో ఉండాల్సిన ప‌రిస్తితిని కూడా వారు చెబుతున్నారు. అయితే జిల్లాలోనే మ‌రికొంద‌రు పార్టీ నేత‌లు అచ్చెన్న‌కే దిక్కూ మొక్కూ లేద‌ని అంటున్నారు. అయితే గతంలో అచ్చెన్న మంత్రిగా ఉన్న‌ప్ప‌టి నుంచి జిల్లా వేదిక‌ల మీద‌, పార్టీ స‌మావేశాల మీద కూన దూకుడ‌ను కంట్రోల్ చేస్తూ వ‌చ్చేవారు. కూన దూకుడు పెరిగితే ఖ‌చ్చితంగా ఆ ఎఫెక్ట్ కింజార‌పు ఫ్యామిలీ మీద ఉంటుంది. అందుకే అచ్చెన్న‌, రాము కూన విష‌యంలో ప‌ట్టించుకోన‌ట్టే ఉంటార‌ని పార్టీ నేత‌లే అంటుంటారు.

అయితే పార్టీలో చంద్ర‌బాబు నుంచి కూన ర‌వికి అభ‌య హ‌స్తం ఉన్న‌ప్ప‌టికీ.. స్థానికంగా కీల‌క నేత‌లు మాత్రం ఆయ‌న‌కు దూరంగా ఉండ‌డంతో కూన వ‌న్ మ్యాన్ షో చేసేందుకు విఫ‌ల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాను దూకుడుగా ఉన్న జిల్లా నేత‌ల స‌పోర్ట్ లేక‌పోవ‌డంతోనే ఆయ‌న ఆవేద‌న‌తో పాటు సైలెంట్ అవ్వాల్సిన ప‌రిస్థితి ఉందంటున్నారు.