“కరోనా విషయంలో దేశ ప్రజలను రక్షించేందుకు మేం అనేక అద్భుతాలు చేస్తున్నాం. మా మంత్రులు, యంత్రాంగం అందరూ కూడా బాగానేపనిచేస్తున్నారు. మీరు మాత్రం మాకు అడ్డు పడొద్దు!”-ఇదీ.. కేంద్రం లోని నరేంద్ర మోడీ సర్కారు దేశసర్వోన్నత న్యాయస్థానం.. సుప్రీం కోర్టుకు తాజాగా వెల్లడించిన అంశం. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పెరిగిపోవడం.. ప్రపంచ మీడియా దుమ్మెత్తిపోయడం.. వ్యాక్సిన్ విధానం అంటూ.. ఒకటి లేకుండా ఎవరి ఇష్టానుసారం వారు వ్యవహరించడం.. వంటివి తెలిసిందే.
అంతేకాదు. వ్యాక్సిన్ తయారీ కంపెనీ.. కేంద్రానికి ఒక రేటుకు, రాష్ట్రాలకు మరో రేటుకు విక్రయించడం.. 18-45 ఏళ్ల వాళ్లకు మే 1 నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని ప్రకటించినప్పటికీ.. ప్రారంభం కాకపోవడం.. కరోనా రోగులకు సరైన వైద్యం అందించలేక పోవడం.. వైద్యులు, ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు ప్రభుత్వ పరంగా అందుతున్న రక్షణ చర్యలు… ఇలా.. అనేకానేక అంశాలపై.. సుప్రీం కోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. గత విచారణ సమయంలో .. ప్రభుత్వం అనుసరిస్తున్న టీకా విధానాన్ని తప్పు పట్టింది.
జాతీయ టీకా విధానాన్ని ఎందుకు అమలు చేయలేయరేంటూ ప్రశ్నించింది. ఇక, రాష్ట్రాలకు ఒక ధరకు , కేంద్రానికి ఒక ధరకు ఎందుకు విక్రయిస్తున్నారని.. అసలు అందరికీ ఉచిత వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వలేరని ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిపై సమాధానంగా కేంద్ర ప్రభుత్వం.. తాజాగా సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ క్రమంలో తాము వ్యాక్సిన్ ప్రక్రియను చాలా పారదర్శకంగా తీసుకువెళ్తున్నామని.. ఈ విషయంలో సుప్రీం కోర్టు(విధాన పరమైన నిర్ణయాలు) జోక్యం చేసుకోకుండా ఉండాల్సిన అవసరం ఉందని తాజాగా పేర్కొంది. ప్రస్తుతం కోర్టు దీనిపై ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో చూడాలి.