గంగా న‌దికీ క‌రోనా.. కొట్టుకొచ్చిన 50 క‌రోనా మృత‌దేహాలు

ప‌విత్ర గంగా న‌దికి కూడా క‌రోనా సోకిందా? హిందూ సామాజిక వ‌ర్గాలు.. అత్యంత ప‌విత్రంగా భావించే గంగాన‌ది నీరు కూడా ఇప్పుడు నిరుప‌యోగంగా అత్యంత ప్ర‌మాద‌క‌రంగా మారిపోయిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మునిసిపాలిటీ అధికారులు. గంగా న‌ది ప్ర‌వాహం ఎక్కువ‌గా ఉన్న యూపీలో ఇప్పుడు గంగా న‌దికి కూడా క‌రోనా ప్ర‌భావం సోకింద‌నే ప్ర‌చారం.. తీవ్ర క‌ల‌కలం రేపుతోంది. వార‌ణాసి స‌హా అనే ప్రాంతాల్లో ప్ర‌వ‌హించే గంగా న‌ది నీటిని.. యూపీలో జ‌నావాసాల‌కు కూడా స‌ర‌ఫ‌రా చేస్తారు.

ఈ నీటినే తాగేందుకు, సాగుకు కూడా వినియోగిస్తారు. అయితే.. ఇప్పుడు తాజాగా ఈ గంగా న‌దికి కూడా క‌రోనా వ‌చ్చింద‌ని సోష‌ల్ మీడియాలో జోరు ప్రచారం సాగుతుండ‌గా.. అధికారులు దీనిని ఇంకా నిర్ధారించ లేద‌ని.. అయితే.. ప్ర‌మాదం మాత్రం పొంచి ఉంద‌ని అంటున్నారు. దీనికి కార‌ణాల‌పై వారు దృష్టి పెట్టారు. అయితే.. ఇప్ప‌టికిప్పుడు అందిన స‌మాచారం ప్ర‌కారం.. యూపీ, బిహార్‌లో ప్ర‌వ‌హించే గంగా న‌దికి ఒక ప్ర‌త్యేకత ఉంది. ఆరు ముక్తి ధామాల్లో గంగా న‌ది కూడా ఒక‌టి.

అయోధ్య‌, మ‌ధుర‌, మాయ‌, కాశీ, కాంచీ, అవంతిక‌ అని ఆరు ముక్తి ధామాల‌ను శాస్త్రాలు పేర్కొంటున్నాయి. వీటిలో మ‌ర‌ణించ‌డం కానీ, మ‌ర‌ణించిన వారి మృత‌దేహాల‌కు ఈ ఆరు ప్ర‌దేశాల్లో ఎక్క‌డైనా అంతిమ సం స్కారం చేయ‌డం వ‌ల్ల కానీ.. ముక్తి ల‌భిస్తుంద‌ని హిందువుల ప్ర‌గాఢ విశ్వాసం. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల 15 రోజులుగా యూపీలో క‌రోనా కార‌ణంగా మృతి చెందిన వారి భౌతిక దేహాల‌ను గంగా న‌దిలో గుట్టు చ‌ప్పుడు కాకుండా క‌లిపేస్తున్నారు. ఎలాంటి హ‌డావుడి లేకుండానే సాగుతున్న ఈ క్ర‌తువుల‌పై అక్క‌డి యోగి ఆదిత్య నాథ్ ప్ర‌భుత్వం నిషేధం విధించింది.

అయితే.. తాజాగా ఇప్పుడు గంగా న‌ది ఒడ్డుకు.. 50 మృత దేహాలు కొట్టుకు వ‌చ్చాయి. బిహార్లోని బక్సర్ జిల్లాలో జ‌రిగిన ఈఘ‌ట‌న‌ తీవ్ర కలకలం రేగింది. గంగానదిలో పదుల సంఖ్యలో మృతదేహాలు కనిపించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మహాదేవ్ ఘాట్ సమీపంలో ఒక్క కిలోమీటరు పరిధిలోనే 48 శవాలు కనిపించాయి. చాలా మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. ఒడ్డుకు కొట్టుకొచ్చిన శరీరభాగాలను కుక్కలు పీక్కుతిన్నాయి.

కరోనాతో చనిపోయినవారిని తమ బంధువులే ఇలా గంగా నదిలో పడేశారని స‌మాచారం అంద‌డంతో అధికారులు ఉరుకులు ప‌రుగులు పెట్టారు. గంగా న‌ది నీటి శాంపిళ్ల‌ను ప్ర‌యోగ‌శాల‌ల‌కు పంపించారు. తాము హెచ్చ‌రించేవ‌ర‌కు ఎవ‌రూ గంగాన‌ది నీటిని తాగొద్ద‌ని బిహార్‌, యూపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించాయి. మ‌రి గంగా న‌ది కూడా అప‌విత్రం అయిపోయిందా? క‌రోనా సోకిందా? చూడాలి ఏం జ‌రుగుతుందో.