ష‌ర్మిల ప‌ని అప్పుడే అయిపోయిందా ?

తెలంగాణ‌లో రెండు నెల‌లుగా రాజ‌కీయంగా ష‌ర్మిల కొత్త పార్టీ వార్త‌లు ఒక్కేట కాక‌రేపుతూ వ‌చ్చాయి. తాను ఎప్పుడు అయితే తెలంగాణ‌లో కొత్త పార్టీ పెడుతున్న‌ట్టు ఆమె ప్ర‌క‌టించారో అప్ప‌టి నుంచి తెలంగాణ‌లో ప్ర‌తి రోజూ ష‌ర్మిల పార్టీ వార్త‌లే ప‌తాక శీర్షిక‌ల్లో నిలిచాయి. ష‌ర్మిల కొత్త పార్టీలోకి ఎవ‌రెవ‌రు వెళ్లిపోతారు ? ఏం జ‌రుగుతుంది ? ఆ పార్టీ ఎక్క‌డ స్ట్రాంగ్‌గా ఉంది ? ష‌ర్మిల ఎక్క‌డ పోటీ చేస్తారు ఈ వార్త‌లే చ‌ర్చ‌ల్లో నిలిచాయి. రెండు నెల‌ల పాటు ష‌ర్మిల రాజ‌కీయం ఓ ఊపు ఊపేసింది.. అయితే ఇది ఇప్పుడు ఒక్క‌సారిగా చ‌ప్ప‌బ‌డిపోయింది. ష‌ర్మిల గురించి తెలంగాణ రాజ‌కీయాల్లో త‌ల‌చే వారే లేకుండా పోయారు. ఇప్పుడు తెలంగాణ‌లో కొత్త పార్టీ అంటే రేవంత్‌రెడ్డి, ఈట‌ల రాజేంద‌ర్‌, కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి ఇలా ర‌క‌ర‌కాల పేర్లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.

ఇక క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. ష‌ర్మిల కూడా బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. వాస్త‌వానికి ఖ‌మ్మంలో ష‌ర్మిల పొలిటిక‌ల్ ఎంట్రీ స‌భ‌ను చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. ఆ వెంట‌నే క‌రోనా జోరు అందుకోవ‌డంతో ఆ స‌భ అనుకున్నంత స‌క్సెస్ కాలేదు. అదే పెద్ద డిజ‌ప్పాయింట్. త‌ర్వాత ష‌ర్మిల తెలంగాణ‌లో ఉద్యోగాలు భ‌ర్తీ చేయాల‌ని దీక్షతో హ‌డావిడి చేశారు. ఒక్క రోజు దీక్ష త‌ర్వాత ఆమె ఇంట్లో దీక్ష చేసినా అది కూడా మ‌మః అయ్యింది. ఆమెకు రావాల్సినంత మైలేజ్ రాలేదు. మ‌ధ్య‌లో కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేయ‌డం ప్రారంభించారు. ఈ లోగా ఈట‌ల ఎపిసోడ్ స్టార్ట్ అవ్వ‌డంతో ష‌ర్మిల రాజ‌కీయాలు, ష‌ర్మిల కొత్త పార్టీ గురించి ప‌ట్టించుకునే తీరిక తెలంగాణ జ‌నాల‌కే కాదు.. చివ‌ర‌కు రాజ‌కీయ వ‌ర్గాలు, మీడియా వాళ్ల‌కు కూడా లేకుండా పోయింది.

ఒక వేళ రేప‌టి రోజున రేవంతో, కొండా, ఈట‌ల లాంటి వాళ్లు పార్టీ పెడితే వీళ్లంతా లోక‌ల్‌గా ఇమేజ్ ఉన్న వాళ్లు కావ‌డంతో ష‌ర్మిల పార్టీకి స్కోప్ ఉంటుంద‌ని ఏ మాత్రం అనుకోలేం. నిన్న మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో అసంతృప్త రెడ్డి నేత‌లు, ద్వితీయ శ్రేణి రెడ్డి నేత‌లు అంతా ష‌ర్మిల పార్టీలో చేర‌తార‌ని పెద్ద ఎత్తున ఊహాగానాలు వ‌చ్చాయి. అందుకే ఆమె రెడ్లు ఎక్కువుగా ఉన్న ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ జిల్లాల‌ను ముందుగా టార్గెట్ చేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ లేదా కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి లాంటి వాళ్లు ఈట‌ల‌తో క‌లిస్తే ఆ రెడ్లు అంతా ష‌ర్మిల పార్టీ క‌న్నా వారితోనే క‌లిసేందుకు మొగ్గు చూపుతారు. ఈ లెక్క‌న ష‌ర్మిల రాజ‌కీయం పార్టీ పెట్ట‌క‌ముందే ముగిసిన‌ట్టు అనుకోవాలి. ఏదేమైనా ష‌ర్మిల తెలంగాణ‌లో పార్టీ ఏర్పాటే ఓ డైల‌మా అనుకుంటే .. తాజా ప‌రిణామాలు ఆమెను మ‌రింత డిఫెన్స్‌లో ప‌డేశాయి.