తెలంగాణ రాజకీయాల ఈక్వేషన్లు మారుతున్నాయా? టీఆర్ఎస్ కీలక నాయకుడు, ఇటీవల మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన.. ఈటల రాజేందర్ సెంట్రిక్‌గా రాష్ట్ర రాజకీయ పరిణామాలు యూటర్న్ తీసుకుంటున్నాయా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. టీఆర్ఎస్ లోనే ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నప్పటికీ.. ఇటీవల కేసీఆర్ తనను మంత్రి వర్గం నుంచి తొలగించడంపై ఈటల తీవ్రంగా మథన పడుతున్నారు. ఈ క్రమంలో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రిజైన్ చేయాలని తలపోస్తున్నారు.
ఇదే జరిగితే.. నెక్ట్స్ స్టెప్ ఏంటనే విషయంపై జోరుగా చర్చ సాగుతోంది. వాస్తవానికి ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ పార్టీలు అంటూ ఉన్నా.. బలంగా లేకపోవడం గమనార్హం. కాంగ్రెస్, బీజేపీలు ప్రస్తుత పరిస్థితిలో అస్తిత్వ పోరాటానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరేందుకు కీలక నేతలు ఎవరూ మొగ్గు చూపలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈటల రాజేందర్ ఏం చేస్తారనే ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. ఇదిలావుంటే.. మరోవైపు.. ఈటల రాజేందర్‌తో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి భేటీ అయ్యారు. మేడ్చల్‌లోని ఈటల నివాసంలో వీరిద్దరూ కలిశారు.
కొండా, ఈటల కలిసి కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై చర్చించేందుకే ఈటల రాజేందర్ ఇంటికి కొండా వెళ్లారని తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరి 2018 ఎన్నికల్లో చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఆయన కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యచరణ ప్రకటించలేదు. కొత్త పార్టీ పెట్టే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈటలను కొండా కలవడంతో ఇద్దరూ కలిసి కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ప్రస్తుతం ఇదే అంశం రాజకీయంగా హాట్ టాపిక్ కావడం గమనార్హం. ఇతర పార్టీల్లోని కీలక నాయకులు కొందరు కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. వీరంతా ఏకమయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. అంటే.. తమకు ప్రజల్లో పట్టున్నా.. పార్టీపరంగా పెద్దగా ప్రాధాన్యం లేక పోవడం.. ఆశించిన విధంగా గుర్తింపు లేకపోగా.. అవమానాలు.. పార్టీలు పుంజుకోలేక ఆపశోపాలు పడుతుండడం వంటివి.. ఈ నేతలను కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈటల వంటి నేత కొత్త పార్టీ పెడతారా? ఏం జరుగుతుంది? అనే సందేహాలు.. చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుండడం గమనార్హం. ఈ క్రమంలో ఇప్పుడు జరిగిన ఈటల-కొండారెడ్డి భేటీకి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. మరి ఫ్యూచర్లో ఎలాంటి ఈక్వేషన్లు తెరమీదికి వస్తాయో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates