క్వారంటైన్‌లోకి విజ‌య‌సాయిరెడ్డి…రూల్స్ ఎవ‌రికైనా ఒక‌టే మ‌రి!

ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురించి, ఆ పార్టీ ముఖ్య‌నేత ఇంకా చెప్పాలంటే నంబ‌ర్ 2 అనే పేరొందిన విజ‌య‌సాయిరెడ్డి గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల ఏదో పొరాపొచ్చాలు వ‌చ్చాయ‌నే ప్ర‌చారం జ‌రిగిన‌ప్ప‌టికీ…అదంతా ఓ ప్ర‌చారం లాగానే ముగిసిపోయింది.

అయితే, విజ‌య‌సాయిరెడ్డి మ‌రో కీల‌క వార్త‌తో తెర‌మీద‌కు వ‌చ్చారు. అదేంటంటే… ఆయ‌న్ను క్వారంటైన్‌లో చేర్చాల‌ట‌. ఎందుకు చేర్చాలి? ఇంత‌కూ ఎవ‌రు ఈ డిమాండ్ చేశారంటారా? ఇంకెవ‌రు ప్ర‌తిప‌క్ష టీడీపీ. అయితే, వాళ్ల డిమాండ్ కూడా అంతే లాజిక్‌గా ఉంది మ‌రి!

టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ తెలంగాణ డీజీపీకి కీల‌క ప్ర‌తిపాద‌న పెడుతూ లేఖ రాశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచాలని తెలంగాణ డీజీపికి రాసిన లేఖలో వర్ల డిమాండ్ చేశారు.

గతంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్‌ను హోమ్ క్వారంటైన్‌లో ఉంచార‌ని పేర్కొన్న వ‌ర్ల రామ‌య్య ఏపీలో విజయసాయిరెడ్డి కూడా ప్రాంతాలు, రాష్ట్రాలు వెళుతూ పబ్లిక్ మీటింగ్స్ నిర్వ‌హిస్తున్నార‌ని, అనంత‌రం హైదరాబాద్‌కు వస్తున్నారని లేఖ‌లో ప్ర‌స్తావించారు. ఈ నేప‌థ్యంలో విజయసాయిరెడ్డిని హోమ్ క్వారంటైన్ లో ఉంచాలని తెలంగాణ డీజీపీని కోరారు.

కాగా, ఏపీ టీడీపీ నేత లాజిక్ ప్ర‌కార‌మే ఈ డిమాండ్ చేసిన‌ప్ప‌టికీ… గ‌తంలోని ప‌లు సంద‌ర్భాల‌ను ఉటంకించిన‌ప్ప‌టికీ…వైసీపీ ముఖ్య‌నేత విష‌యంలో తెలంగాణ స‌ర్కారు అలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందా? గ‌త కొద్దిరోజులుగా రెండు రాష్ట్రాల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న త‌రుణంలో…సీరియ‌స్‌గా తీసుకునే చాన్స్ ఉందా? లేక‌పోతే…టీడీపీ నేత లేఖ‌ను చెత్త బుట్టలో వేయ‌నుందా? అనే క్లారిటీ రావాలంటే మ‌రికొద్ది రోజులు ఆగాల్సిందే.