సాధారణంగా.. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా.. ప్రతిపక్షాలను సాధ్యమైనంత వరకు సైలెంట్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఎక్కడ విమర్శలు చేస్తారో.. ఎక్కడ తాము ఇప్పటి వరకు పడిన కష్టం పాడైపోతుందో అని పార్టీలు అల్లాడిపోతుంటాయి. దీంతో దాదాపు ప్రతిపక్షాలకు పనిలేకుండా చేసేందుకు ప్రయత్నిస్తుంటాయి. దీంతో ప్రతిపక్షాలే.. కొత్త సమస్యలు వెతికి మరీ తెరమీదికి తెచ్చి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుంటాయి. తెలంగాణను తీసుకుంటే..అక్కడ ప్రభుత్వం నుంచి ప్రతిపక్షాలకు ఎలాంటి పని దొరకదు. కానీ.. ప్రతిపక్షాల నుంచి తనను తాను కాపాడుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తుంటుంది.
ఏపీ విషయానికి వస్తే.. మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి.. సీఎం జగనే చేతి నిండా .. నోటినిండా పనికల్పిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. జగన్ తీసుకునే నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలు.. చాలా వరకు వివాదం లేకుండానే నడుస్తున్నాయి. దీంతో ప్రతిపక్షాలకు ఛాన్స్ ఉండడం లేదు. పేదలకు ఇళ్ల పథకం కానీ, 45 ఏళ్లు నిండిన మహిళలకు పింఛన్లు ఇచ్చే విషయం కానీ, చేయూత పథకం కానీ, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ఇలా అనేక విషయాల్లో జగన్ను విమర్శించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో చాలా వరకు కూడా ప్రతిపక్షాలు కొన్ని కొన్ని విషయాలపై మౌనం పాటిస్తున్నాయి.
ఇక, కొన్ని రోజులు విమర్శలు చేసిన వలంటీర్ వ్యవస్థపై కూడా తర్వాత తర్వాత మౌనం పాటించాయి. ఇక్కడ చిత్రంగా వలంటీర్ వ్యవస్థను వద్దన్నవారే.. ఈ వ్యవస్థలోకి వైసీపీ కార్యకర్తలు జొరబడ్డారని ఆరోపణలు చేసిన టీడీపీ నేతలే.. తర్వాత తర్వాత.. వారికి జీతాలు పెంచాలంటూ. విమర్శలు చేయడం గమనార్హం అంటే.. జగన్ నిర్ణయాలు దాదాపు ప్రతిపక్షాలకు పనిలేకుండా చేశాయి. అయితే.. జగన్ తీసుకునే కొన్ని నిర్ణయాలు మాత్రం ఇప్పుడు పనికల్పించాయి. అదే.. ఇంటర్ పరీక్షల నిర్వహణ. ఒకవైపు రాష్ట్రంలో కరోనా తీవ్రత వెంటాడుతోంది.
దీంతో ప్రజలు కూడా భయంభయంగా కాలం గడుపుతున్నారు.కానీ, జగన్ మాత్రం పరీక్షలు పెట్టితీరాల్సిందేనని ప్రకటించారు. దీంతో ఇంకేముంది.. ప్రజల పక్షాన మేం నిలుస్తాం.. అంటూ.. టీడీపీ, ఇతర పార్టీలు కూడా ముందుకు వచ్చాయి. ఇదే ప్రకటన.. జగన్ చేసి ఉండకపోతే.. ఈ పార్టీలకు పనిలేకుండా పోయేదని అంటున్నారు. మొత్తానికి ప్రతి పక్షాలకు పనికల్పిస్తున్నందుకు.. జగన్ను మెచ్చుకోవాలా? ఆయన తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వస్తున్నందుకు బాధపడాలా? అనేది తర్జన భర్జన!!
Gulte Telugu Telugu Political and Movie News Updates