‘పరీక్షలు నిర్వహించకుండా పాస్ చేసేస్తే సర్టిఫికేట్ మీద కేవలం పాస్ అని మాత్రమే ఉంటుంది. ఈ సర్టిపికేట్ తో మంచి కాలేజీల్లో విద్యార్ధి సీటు తెచ్చుకోగలడా’ ?.. ఇది జగన్మోహన్ రెడ్డి వినిపించిన లాజిక్. పదవతరగతి పరీక్షలను రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ చాలా ఉదృతంగా ఉంది కాబట్టే లక్షలాది మంది విద్యార్ధులు, వాళ్ళ తల్లి, దండ్రుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పరీక్షలను రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రతిపక్షాల డిమాండ్లలో లాజిక్ ఉంది. ఎలాగంటే వైరస్ కేసులను నియంత్రించేంత సీన్ ప్రభుత్వానికి లేదు. కాబట్టి స్టే హోం..స్టే సేఫ్ అనే నినాదన్ని ప్రభుత్వమే ఇస్తోంది. కేసుల ఉదృతి పెరిగిపోతున్న కారణంగా వాటిని అరికట్టలేక చాలా పట్టణాల్లో మినీ లాక్ డౌన్లు విధిస్తోంది. తిరుపతి లాంటి కొన్ని నగరాల్లో కర్ఫ్యూ కూడా విధించింది. ఇదంతా ప్రభుత్వం ఎందుకు చేసింది ? ఎందుకంటే జనసంచారాన్ని నియంత్రించటానికే.
మరి జనాలను విచ్చలవిడిగా బయట తిరగద్దని ఒకవైపు చెబుతున్న ప్రభుత్వమే మళ్ళీ 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహిస్తామని చెప్పటంలో అర్ధమేంటి ? పరీక్షలంటే ఒక్కసారిగా లక్షలమంది విద్యార్ధులు, వాళ్ళకోసం తల్లి, దండ్రులు సెంటర్లకు వస్తారని అందరికీ తెలిసిందే. మరపుడు కరోనా వైరస్ సోకకుండానే ఉంటుందా ? ఎవరికైనా వైరస్ సోకి చనిపోతే బాధ్యత ఎవరు తీసుకుంటారు ? పరీక్షలకన్నా విద్యార్ధుల ప్రాణాలే ముఖ్యమన్న విషయాన్ని జగన్ ఎందుకు గుర్తించటంలేదు ?
ఇక జగన్ వాదననే తీసుకుంటే నిజమే పాస్ సర్టిఫికేట్ ఇచ్చినంత మాత్రాన మంచి కాలేజీల్లో సీటు వచ్చేది అనుమానమే అనుకుందాం. ఈ సమస్య ఒక్క ఏపిలో మాత్రమే లేదు కదా. దేశంలోని చాలా రాష్ట్రాలు ఇఫ్పటికే 10వ తరగతి పరీక్షలను రద్దుచేశాయి. మరి వాళ్ళ విద్యార్ధులకు కూడా ఇదే సమస్య కదా. దేశమంతా ఒకే సమస్య అయినపుడు ఏపిలో విద్యార్ధుల సమస్యగా మాత్రమే జగన్ ఎందుకు మాట్లాడుతున్నట్లు ?
అసలు సీట్లిచ్చే కాలేజీల్లో కూడా ఇదే సమస్య కదా. అపుడు విద్యార్ధి కోరుకున్న సీటును కాలేజీ ఎందుకివ్వదు. ఏమిటో జగన్ వాదనలో లాజిక్ కనబడటంలేదు. పైగా కరోనా సమస్యతో బాధపడుతున్న విద్యార్ధులకు ప్రత్యేకంగా రూములు ఏర్పాటు చేస్తారట. ఆ రూముల్లో ప్రశ్నపత్రాలను ఎవరివ్వాలి ? మరి ఆ రూముల్లో ఇన్విజిలేషన్ ఎవరు చేయాలి ? రూములో అంతా కరోనా రోగులే అని తెలిసిన తర్వాత ఇక ఎవరైనా డ్యూటీ చేస్తారా ? వీళ్ళ ద్వారా మిగిలిన విద్యార్ధులకు, డ్యూటీచేసే వాళ్ళకు సోకకుండా ఉంటుందా ? కాబట్టి క్షేత్రస్ధాయిలోని పరిస్ధితులను గమనించి నలుగురు చెప్పేది వింటే జగన్ కే మంచిది.
Gulte Telugu Telugu Political and Movie News Updates