“కొంచెం వెయిట్ చేయండి.. సీఎం సార్ జగనే రంగంలోకి దిగుతున్నారు”- ఇదీ రెండు రోజులుగా వైసీపీ నేతలకు సర్కారువారి కీలక సలహాదారు.. వైసీపీ కీలక నేత నుంచి ఫోన్లో అందుతున్న సమాచారం. ఈ జిల్లా ఆ జిల్లా అనే కాదు.. దాదాపు 11 జిల్లాల్లోని వైసీపీ నేతలతో ఆయన ఫోన్ లో మాట్లాడినట్టు వైసీపీ వర్గాల మధ్య చర్చ నడుస్తోంది. మరో రెండు నెల్లలోనే వైసీపీ ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో కనీ వినీ ఎరుగని రీతిలో జిల్లాల్లో సంబరాలు చేసేందుకు పార్టీ అధిష్టానం నుంచి సంకేతాలు వస్తున్నాయి.
దీంతో సదరు సలహాదారు.. అన్ని జిల్లాల్లోని కీలక నేతలకు.,. పార్టీ అధ్యక్షులకు కూడా ఫోన్లు చేస్తున్నారు. పార్టీ పరిస్థితి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ఎలా అందుతున్నాయి. వీటిపై ప్రజలు ఏమనుకుంటున్నారు? పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది? అనే విషయాలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంటున్నారు. వాస్తవానికి నెల రోజుల కిందటే స్థానిక ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో పార్టీ విజయ దుందుభి మోగించింది. దీనికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలే కారణమని సర్కారు పెద్దలు చెబుతున్నారు.
అయినప్పటికీ.. కొన్ని జిల్లాల్లో టఫ్ ఫైట్ సాగడం, విశాఖ, గుంటూరు కార్పొరేషన్లలో టీడీపీ హోరా హోరీ పోరుకు నిలవడం వంటి పరిణామాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో అసలు వాస్తవ పరిస్థితి ఏంటి? ఎన్నికల్లో జరిగింది ఏంటి? ప్రభుత్వంపై ప్రజానాడి ఎలా ఉంది? అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయడంతోపాటు.. రెండేళ్ల సంబరాలను జోరుగా నిర్వహించేందుకు అవసరమైన సకల సదుపాయాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో సదరు సలహాదారు ఫోన్లు చేస్తున్నారు.
అయితే.. సర్కారు పెద్దలు ఆశించిన విధంగా జిల్లా నేతల నుంచి పాజిటివ్ విషయాల కన్నా.. కూడా నెగిటివ్ విషయాలే ఎక్కువగా వస్తున్నాయి. మంత్రుల హవా, ఎమ్మెల్యేల దూకుడు.. ఎంపీలకు , నేతలకు మద్య ఉన్న సమన్వయ లోపం వంటివి ప్రముఖంగా చర్చకు వస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో సదరు సలహాదారు.. త్వరలోనేసీఎం జగన్ రంగంలోకి దిగుతారని.. మీరంతా వెయిట్ చేయాలని ఇలాంటి సమస్యలు చెబుతున్న నేతలకు సూచిస్తున్నట్టు వైసీపీలో చర్చ సాగుతోంది. మరి ఏం చేస్తారో చూడాలి.