ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్.. కన్నా లక్ష్మీనారాయణకు త్వరలోనే అదృష్టం వరించనుందా ? ఆయనను వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల పరిశీలకుడిగా పంపించాలని లేదా.. కేంద్ర పార్టీలోకి తీసుకోవాలని.. యోచిస్తున్నట్టు బీజేపీ నేతల మధ్య చర్చ సాగుతోంది. కాంగ్రెస్లో సుదీర్ఘ అనుభవం గడిచింన కన్నాపై ఎన్నో ఆశలతోనే బీజేపీ పెద్దలు ఆయనను పార్టీలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వచ్చీరావడంతోనే ఆయనకు ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించారు. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడి హోదాలో గత ఎన్నికల్లో నరసారావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసిన కన్నాకు కనీసం డిపాజిట్ కూడా రాలేదు సరికదా ? ఒక్క నియోజకవర్గంలో గెలుపు సంగతి అటుంచితే డిపాజిట్ కూడా రాలేదు.
గత సాధారణ ఎన్నికల్లో పార్టీ ఏపీలో ఘోర పరాజయం పాలైంది. అయితే.. మొదట దీనిని కన్నా తప్పుగానే ప్రొజెక్టు చేసేందుకు ప్రయత్నాలు సాగాయి. దీంతో జాతీయ నాయకులు సైతం ఆయనను పక్కన పెట్టారు. అనంతరం.. కన్నా కూడా సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన్ను తప్పించిన అధిష్టానం సోము వీర్రాజుకు పార్టీ పగ్గాలు ఇచ్చింది. అయితే పార్టీ బలపడలేదు సరికదా ? సోము దూకుడు వల్ల కొన్ని వర్గాలు పార్టీకి దూరమవుతోన్న పరిస్థితి. దాదాపు ఏడాది కాలంగా రాష్ట్రంలో పరిస్థితులను గమనించిన కేంద్ర బీజేపీ నేతలు.. ఇక్కడ కన్నా విఫలం కాలేదని.. కేవలం కొన్ని కారణాల వల్లే ఆయన పనితీరు మెరుగపడలేదని.. భావించారు.
ఈ క్రమంలోనే కన్నా, సోము మధ్య కంపేరిజన్లు కూడా చేసుకున్నాక కన్నాపై ఎందుకో గాని సింపతీ అయితే పార్టీ నాయకత్వంలో ఉందంటున్నారు. ఇక, కన్నా కూడా రాష్ట్ర రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అడుగడునా.. వెనక్కి లాగేవారే తప్ప.. తనకు సహకరించిన నాయకులు ఏ ఒక్కరూ లేరని ఆయన మదనపడుతున్నారు. రాజధాని అమరావతి విషయంలోను.. ఇసుక మాఫియా విషయంలోను.. జగన్ ప్రభుత్వంపై తాను అవలంభించిన తీరు విషయంలోనూ ఎవరూ సహకరించకపోగా.. తనపైనే కేంద్ర పెద్దలకు కంప్లెయింట్లు ఇచ్చారని.. ఆయన ఆవేదనగా ఉన్నారు.
ఇక జగన్ను విమర్శిస్తే తాను చంద్రబాబు కోవర్టును అంటూ పార్టీలోనే కొందరు ముద్రవేసి అధిష్టానం వద్ద కంప్లైంట్ చేయడం కూడా ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో ఆయన పెద్దగా పార్టిసిపేట్ కాలేదు. తనకు కేంద్ర పార్టీలోనే ఏదైనా పదవి ఇవ్వాలని ఆయన కొన్నాళ్ల కిందట జాతీయ నేతలను అభ్యర్థించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు త్వరలోనే కేంద్ర పార్టీలో కీలక పదవి దక్కుతుందని అంటున్నారు. మరి ఎలాంటి పదవి దక్కుతుందనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates