కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రి వేళల్లో కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు దీనిని అమలు చేయనున్నారు. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఈ నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు మంత్రి ఆళ్ల నాని.. ప్రకటించారు. దీనిపై విస్తృతంగా చర్చించినట్టు ఆయన తెలిపారు. మంత్రి వర్గంలో అన్ని కోణాల్లోనూ చర్చించామన్నారు.
రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసిన దరిమిలా.. కరోనా నియంత్రణలో భాగంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి నాని తెలిపారు. అయితే.. అత్యవసర సేవలకు.. మినహాయింపు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇక, కరోనా వ్యాక్సిన్ను ఇప్పటికే 45 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా ఇస్తున్న విషయాన్ని చెప్పిన మంత్రి నాని.. ఇప్పుడు 18 ఏళ్ల వయసు పైబడిన వారికి కూడా ఉచితంగా ఇస్తామని చెప్పారు.
18-45 ఏళ్ల వయసు ఉన్న వారికి కూడా ఉచిత వ్యాక్సిన్ ఇచ్చేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి నాని తెలిపారు. దీనికి గాను ప్రభుత్వంపై రూ.1600 కోట్ల మేరకు భారం పడుతుందని తెలిపారు. మరో వైపు.. కరోనా పరీక్షలను కూడా విస్తృతంగా చేయనున్నట్టు తెలిపారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించాలని మంత్రి నాని సూచించారు. మొత్తానికి ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కర్ఫ్యూ విధించగా.. ఇప్పుడు ఏపీలోనూ అమలులోకి రావడం గమనార్హం.