వైజాగ్ గ్యాస్ లీక్ ఉదంతంలో ఓవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్వర స్పందన ప్రశంసలందుకుంటుంటే.. దీన్ని హైలైట్ చేసే క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు జగన్‌కు, పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నాయి. గ్యాస్ లీక్ కారణంగా చనిపోయిన మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున జగన్ భారీ పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే ఎంత పరిహారం ప్రకటించినా పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అంటూ బాధితులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.
తట్టుకోలేని బాధతో ఎల్జీ పాలిమర్స్ ముందు ఆందోళన కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐతే ఆ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మృతులకు రూ.25 లక్షల పరిహారం ఇస్తేనే ఎక్కువ అని, అలాంటి జగన్ కోటి రూపాయలు ప్రకటిస్తే సంతోషించడం పోయి విమర్శలు చేయడం ఏంటంటూ చేసిన కామెంట్ విమర్శల పాలైంది.
జగన్ ఎవ్వరూ ఊహించని స్థాయిలో భారీ పారితోషకమే ప్రకటించారు. అంతమాత్రాన రూ.25 లక్షలే ఎక్కువ అంటూ బాధితుల ప్రాణాల విలువను తక్కువ చేయడం తప్పు.
ఈ కామెంటే తప్పు అంటే.. తాజాగా వైకాపా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మరో షాకింగ్ కామెంట్ చేశారు. జగన్ కోటి రూపాయల పారితోషకం ప్రకటించడం చూసి.. గ్యాస్ లీక్ ప్రభావిత ప్రాంతాల్లో కొందరు తమ కుటుంబంలో ఎవరైనా చనిపోయి కోటి రూపాయలు తమకు పరిహారం వచ్చినా బాగుండేదే అనుకుంటున్నారంటూ ఆయన కామెంట్ చేయడం గమనార్హం.
ఈ మాట తాను చెప్పకూడదు అంటూనే అనరాని మాట అనేశారు ఎమ్మెల్యే. ఓవైపు బాధితులు కోటి రూపాయలు వెనక్కిస్తాం మీరొచ్చి విషవాయువు పీల్చండి అని ఆక్రోశం వెళ్లగక్కుతుంటే ఎమ్మెల్యే ఇలాంటి కామెంట్ చేయడం దారుణం.