గుజ‌రాత్ కంపెనీకి జ‌గ‌న్ కితాబు..

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజ‌రాత్‌లో పుట్టిన అమూల్ కంపెనీకి.. ఏపీ సీఎం జ‌గ‌న్ పెద్ద ఎత్తున స‌ర్టిఫికేట్ ఇచ్చారు. అమూల్ ప్ర‌పంచ ప్ర‌సిద్ధ కంపెనీ అని పేర్కొన్న ఆయ‌న‌.. ఆ కంపెనీ ఏపీలో పాల‌ను సేక‌రించ‌డం.. ఇక్క‌డి ప్ర‌జ‌ల అదృష్టంగా పేర్కొన్నారు. రాష్ట్ర డెయిరీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని జగన్ తెలిపారు. అమూల్‌ ప్రాజెక్ట్‌పై ఆయ‌న‌ సమీక్ష నిర్వహించారు. అనంతరం గుంటూరు జిల్లాలో ‘అమూల్‌ పాల వెల్లువ’ ప్రాజెక్ట్‌ను వర్చువల్‌ విధానంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ, పాల సేకరణలో ఉన్న మహిళలకు స్వయం ఉపాధి ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు.

అమూల్ ద్వారా ఇప్పటికే 400 గ్రామాల్లో పాలసేకరణను చేపట్టామని తెలిపారు. గుంటూరు జిల్లాలో 180 గ్రామాల్లో పాలసేకరణకు శ్రీకారం చుట్టామని.. చిత్తూరు జిల్లాలో మరో 170 గ్రామాల్లో పాలసేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. “అమూల్ సంస్థ ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది. అమూల్‌ ఒక సహకార సంస్థ.. అక్కచెల్లెమ్మలే వాటాదారులు. అమూల్‌తో ఒప్పందం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. అమూల్‌ సంస్థ లాభాలను పాడి రైతులకే తిరిగి చెల్లిస్తున్నారని” సీఎం పేర్కొన్నారు.

అయితే.. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో.. గుజ‌రాత్‌కు చెందిన కంపెనీకి ఇంత భారీ రేంజ్‌లో జ‌గ‌న్ .. స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డ‌మే. ఇత‌ర రాష్ట్రాల్లోనూ అమూల్ సంస్థ ప‌నిచేస్తున్నా.. అక్క‌డ ఎవ‌రూ .. ఏ సీఎంలూ.. ఈ రేంజ్‌ల స‌ర్టిఫికెట్‌లు ఇవ్వ‌డం లేదు. పైగా స్థానిక పాల ఉత్ప‌త్తి దారులను కాపాడుకుంటూనే అమూల్‌కు అవ‌కాశం ఇస్తున్నారు త‌ప్ప‌.. ఎక్క‌డా పూర్తిగా అమూల్ ను ప్ర‌మోట్ చేస్తున్న దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. కానీ ఒక్క ఏపీలో మాత్రం.. సీఎం జ‌గ‌న్ స‌ర్కారు అమూల్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.