హైదరాబాద్ నగరవాసులకు GHMC ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో ఏకంగా 90 శాతం రాయితీని ప్రకటించింది. ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ OTS పథకం కింద ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు కమిషనర్ ఆర్.వి. కర్ణన్ వెల్లడించారు. ఈ నెలాఖరు అంటే మార్చి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు ఈ 15 రోజుల్లోపు తమ బకాయిలను క్లియర్ చేసుకుంటే భారీగా వడ్డీ భారం తగ్గుతుంది.
ఈ ఏడాది ఆస్తి పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి రూ. 1,984 కోట్లు వసూలు కాగా, ఈసారి అది రూ. 2,186 కోట్లకు చేరింది. నగరంలో మొత్తం 28.08 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉండగా, ఇప్పటివరకు 16.80 లక్షల మంది తమ పన్నులు చెల్లించారు. ఇంకా బకాయిలు ఉన్నవారు మీ సేవా కేంద్రాలు, జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్ లేదా MyGHMC మొబైల్ యాప్ ద్వారా సులభంగా ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయవచ్చు.
కేవలం పన్ను వసూళ్లే కాకుండా, నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక డ్రైవ్‌లను కూడా నిర్వహిస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా మార్చి 6 నుంచి 16 వరకు నగరవ్యాప్తంగా పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. చెత్తాచెదారం తొలగించడం, ఫైళ్ల క్లియరెన్స్, ఈ-వేస్ట్ సేకరణ వంటి కార్యక్రమాలను 150 వార్డుల్లో పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా బహిరంగ మరుగుదొడ్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ ఓటీఎస్ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ వినూత్నంగా ప్రచారం చేస్తోంది. ఇప్పటికే బస్ షెల్టర్లు, ఎఫ్ఎం రేడియో, సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు ఇస్తున్నారు. రేపటి నుంచి నగరంలోని సినిమా థియేటర్లలో ఈ వీడియోలను ప్రదర్శించనున్నారు. పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని జారవిడుచుకోకుండా గడువులోపు బకాయిలు చెల్లించాలని అధికారులు కోరుతున్నారు. ఒకవేళ గడువు ముగిసినా పన్నులు చెల్లించకపోతే జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates