జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎన్నికల సంఘం పెద్ద షాకే ఇచ్చింది. కామన్ సింబల్ గా జనసేన వాడుకుంటున్న గాజు గ్లాసు గుర్తు పార్టీకి దూరమైపోయింది. తెలంగాణాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీకి కామన్ సింబల్ గా గాజు గ్లాసును కేటాయించాలని జనసేన ఎన్నికల కమీషన్ను అడిగింది. అయితే అందుకు కమీషన్ నిరాకరించింది. 2025, నవంబర్ వరకు జరిగే ఏ ఎన్నికలో కూడా జనసేన గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా వాడుకునేందుకు లేదని స్పష్టంగా చెప్పేసింది.
విషయం ఏమిటంటే తనకు ఇష్టముంటే ఎన్నికల్లో పోటీ చేయటం లేకపోతే మానేయటం పవన్ కు అలవాటైపోయింది. ఇంతవరకు జనసేనకు శాశ్వత ఎన్నికల గుర్తంటు లేదు. ఎన్నికల కమీషన్ దగ్గర రిజస్టర్ అయిన పార్టీనే కానీ రికగ్నైజ్డు పార్టీ కాకపోవటంతోనే శాశ్వత గుర్తంటు కేటాయింపు జరగలేదు. రికగ్నైజ్డు పార్టీగా శాశ్వత గుర్తు పొందాలంటే చాలా పెద్ద తతంగమే ఉంది. పోలైన ఓట్లలో ఇంత శాతమని, లేదా పోటీచేసిన స్ధానాల్లో గెలవాల్సిన స్ధానాల్లో లెక్కుంది.
ఎన్నికల కమీషన్ లెక్కల్లో దేనిలోను జనసేన ఫిట్ అవ్వదు. అందుకనే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో కూడా గాజుగ్లాసు గుర్తును నవతరం పార్టీకి కేటాయించేశారు. ఆ విషయమై జనసేన అభ్యంతరం చెప్పినా కేంద్ర ఎన్నికల కమీషన్ లెక్కే చేయలేదు. ఇపుడు తెలంగాణా మున్సిపల్ ఎన్నికల్లో గుర్తు విషయంలో కూడా స్టేట్ ఎలక్షన్ కమీషన్ పట్టించుకోలేదు. వరుసగా ఎన్నికల్లో పోటీ చేయటం, స్ధానాలు గెలుచుకోవటం లేదా ఓట్ల శాతం పెంచుకోవటం చేయకపోతే ఎన్నికకో గుర్తుమీద జనసేన పోటీ చేయాల్సి రావటం ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates