ఆయన టీడీపీ మాజీ నాయకుడు.. ఈ పార్టీ నుంచే రాజ్యసభకు ఎంపికయ్యాడు. కానీ, అనూహ్య రీతిలో బీజేపీలోకి జంప్ అయ్యారు. ఆయనే టీజీ వెంకటేష్. కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ పొలిటీషియన్. అవకాశం వచ్చినప్పుడల్లా.. ఈయన జగన్‌పైనా.. వైసీపీపైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన చరిత్ర కూడా ఉంది.
గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు మంత్రి పదవిని తెచ్చుకున్నారు. తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీలోకి వచ్చారు. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో.. ఆయన వెంటనే బీజేపీలోకి జంప్ చేశారు. ప్రస్తుతం బీజేపీ రాజ్యసభ సబ్యుడిగా చలామణి అవుతున్నారు. ఇక ఆయన తనయుడు భరత్ మాత్రం టీడీపీలోనే ఉండడంతో పాటు కర్నూలు టీడీపీ ఇన్‌చార్జ్‌గా కూడా ఉన్నారు.
ఇలా.. ఎటు అవకాశం ఉంటే.. అటు రాజకీయాలు చేయడం.. పార్టీల గోడలు దూకడం.. నేతలను కాకా పట్టడంలో టీజీని మించినవారు లేరని అంటారు. ఇప్పుడు.. ఈయన వైసీపీ అధినేత జగన్‌ను కాకా పట్టారని.. వైసీపీలోని సీనియర్లే అంటున్నారు. అంతేకాదు.. ఏకంగా కర్నూలు జిల్లాలోని కుందూ నది ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్టు పనులను సగం టీజీకి ఇచ్చేలా పార్టీ అధిష్టానం నుంచే కర్నూలు నేతలకు ఆదేశాలు వచ్చాయని .. దీంతో ఆయనకు ఇటీవలే పనులు కూడా అప్పగించారని పెద్ద ఎత్తున పేర్లు పెట్టి మరీ.. విమర్శలు రువ్వుతున్నారుసీనియర్లు.
గతంలో మమ్మల్ని తిట్టారు. జగన్‌ను తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు ఆయనకు సగం కాంట్రాక్టు అప్పగించడం ఏంటి ? మా పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయింది. కర్నూలు.. జిల్లాలో ప్రజలు పూర్తిగా మాకే పట్టం కట్టారు. మేం వాళ్లకు ఇప్పటి వరకు ఒక్క పనికూడా చేసిపెట్టలేక పోయాం. ఇప్పుడు మేం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. కనీసం ఓ పది లక్షల విలువైన పనులు కూడా మాకు ఇవ్వడం లేదు. పోయి పోయి.. టీడీపీ అనుకూల నేతలకు, బీజేపీ అనుకూల నాయకులకు సబ్ కాంట్రాక్టులు ఎలా కట్టబెడుతున్నారని వైసీపీ నేతలు వాపోతున్నారు.
పైకి విరోధం అంటున్నారు.. పైకి విభేదాలు అంటున్నారు. కానీ, లోపాయికారీగా ఈ ఒప్పందాలు ఏంటి? ప్రజలకు మేం ఏం చెప్పాలన్నదే పార్టీ నేతల ప్రశ్న. ప్రస్తుతం జిల్లాలో సొంత పార్టీకే చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య చర్చలను బట్టి చూస్తే వైసీపీ అధినేత తీరుపై వీరంతా ఆగ్రహంతోనే ఉన్నారని తెలుస్తోంది. అయిన వారికి ఆకుల్లోను, కాని వారికి కంచాల్లోనూ.. జగన్ వడ్డిస్తున్నారని విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఇక కర్నూలు జిల్లాకు చెందిన పనులు కూడా ఈ జిల్లా నేతలకు కాకుండా చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మంత్రికే ఇచ్చేస్తున్నారట. దీంతో వీరి బాధలు చెప్పలేనివిగా ఉన్నాయి.