తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో గట్టి పోటీ ఇవ్వాలని భావించిన కాంగ్రెస్ నేత, సీనియర్ నాయకుడు.. చింతా మోహన్.. ఒంటరి పోరు చేస్తున్నారనే అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి ఆయనకున్న పలుకుబడి.. స్థానికంగా ఉన్న పట్టు వంటి రాజకీయ అంశాలను పరిశీలిస్తే.. భారీ ఎత్తున ఆయన పోటీ ఇచ్చే అవకాశం ఉంది. పైగా ఇటీవల కాలంలో ఆయన వైసీపీ అధినేత జగన్‌ను కూడా టార్గెట్ చేసుకుని కామెంట్లు చేశారు. ఈ క్రమంలో చింతా మోహన్‌కు ఒకింత జోష్ పెరిగింది. సోషల్ మీడియాలోనూ ఆయనకు ఫాలోవర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ హైకమాండ్ నుంచి టికెట్ తెప్పించుకున్నారు. తిరుపతి పార్లమెంటు స్థానానికి మొత్తం తొమ్మది సార్లు పోటీ చేసి ఆరు సార్లు గెలిచిన ఆయన మూడు సార్లు ఓడిపోయారు. ఇక ఇప్పుడు పదోసారి ఆయన తిరుపతి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇక, మరో మూడు రోజులు మాత్రమే ప్రచారానికి మిగిలి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏవిధంగా ముందుకు సాగాలి? ఎలాంటి ప్లాన్ చేసుకుని వైసీపీకి చెక్ పెట్టాలనే వ్యూహం మాత్రం కాంగ్రెస్‌లో కొరవడిందనే చెప్పాలి. కేవలం చింతా మోహన్.. మాత్రమే కాలికి బలపం కట్టుకుని మరీ ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అప్పుడప్పుడు చూసి ఫొటోలకు పోజులిచ్చివెళ్తున్నారని చింతా కుటుంబం ఆరోపిస్తోంది.
మరోవైపు వైసీపీకి పోటీగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ దూకుడు ఎక్కువగా ఉంది. అదే సమయంలో అధికార వైసీపీ నేతలు కూడా భారీ ఎత్తున ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో చింతాకు కొంత ఇమేజ్ ఉన్నా.. ఓట్లు పడతాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నా.. కాంగ్రెస్‌లో మాత్రం ఆ తరహా దూకుడు కనిపించడం లేదు. నిజానికి ఇక్కడ వైసీపీ గెలిచినా.. మెజారిటీ తగ్గిస్తే.. జగన్‌ను కొంత మేరకు నిలువరించినట్టు అవుతుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.
ఈ క్రమంలో మంచి అవకాశం ఉండి కూడా కాంగ్రెస్ నేతలు వినియోగించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు లేరని.. అంటున్నారే తప్ప.. ఉన్న వారిని సమన్వయం చేయడం .. ముందుకు నడిపించడం వంటి బాధ్యతలను ఎవరూ తీసుకోకపోవడం చింతా మోహన్‌కు ఇబ్బందికరంగా మారిందనడంలో సందేహం లేదు.