తిరుపతి ఉపఎన్నిక రికార్డుగా నిలుస్తుందా ?

ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం అవుననే అనుకోవాలి. ఏ విషయంలో ఉపఎన్నిక రికార్డుగా నిలుస్తుంది ? ఎలాగంటే డబ్బు విషయంలో. అవును  ఏ ఎన్నికలో అయినా ప్రధాన భాగం ఖర్చులదే ఉంటుంది. ఎన్నికలు ఇంత కాస్ట్లీ అయిపోయిందంటే అందుకు ప్రతిపార్టీని తప్పు పట్టాల్సిందే. మామూలుగా ఓ పార్లమెంటు జనరల్ సీటుకు ఎన్నిక జరిగితే తక్కువలో తక్కువ రూ. 100 కోట్లు ఖర్చువుతుందనటంలో సందేహం లేదు.

అలాగే అసెంబ్లీ జనరల్ సీటుకు సుమారు రు. 50 కోట్లు లేందే ఎన్నికలో పోటీ చేయటం సాధ్యంకాదు. ఇవే సీట్లు రిజర్వుడు నియోజకవర్గాలైతే ఖర్చులు తగ్గుతాయి. అంతేకానీ డబ్బుతో పనేలేకుండా ఎన్నికైతే జరగదు. ఇలాంటి పరిస్ధితిలో రెండు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు డబ్బుల ప్రస్తావనను ఇప్పటివరకు తేవటంలేదని సమాచారం. రెండుపార్టీల్లో దేని కారణాలు వాటికున్నాయి.

మొదటి అధికార పార్టీ విషయం చూస్తే వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుండి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. సంక్షేమ పథకాల రూపంలో సగటున అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఏడాదికి సుమారు రు. లక్షన్నర రూపాయలు అందుతోంది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు అందుతున్నపుడు మళ్ళీ ఎన్నికల్లో ప్రతి ఓటుకు డబ్బులు ఎందుకు పంచాలనేది జగన్ లాజిక్.  

ఓటరకు విడిగా డబ్బులు పంపిణీ చేయాల్సిన అవసరం లేదని జగన్ ముఖ్య నేతలకు స్పష్టంగా చెప్పారట. అందుకనే పథకాలను మాత్రమే ప్రచారంలో వైసీపీ హైలైట్ చేస్తున్నది. వీటికి అదనంగా రాజకీయంగా ఒకరిపై మరొకరు చేసుకునే విమర్శలు, ఆరోపణలు ఎలాగు ఉండేవే. ఇదే సమయంలో టీడీపీ విషయం చూస్తే గెలుపు అనుమానమే. కాబట్టి ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసినా ఏ మేరకు ఉపయోగం ఉంటుందనేది సందేహంగానే ఉంది.

అందుకనే డబ్బుల పంపిణీ గురించి కాకుండా ప్రభుత్వ వైఫల్యాలు, జగన్ మైనస్ పాయింట్లపైనే ఎక్కువగా ఫోకస్ చేయాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఈ కారణంగానే ఎన్నికల వేడి ఎంతగా రాజుకున్నా డబ్బుల ప్రస్తావన మాత్రం నియోజకవర్గంలో ఎక్కడా వినబడటంలేదు. మరో మూడు రోజుల్లో ప్రచారం ముగుస్తోంది. అందుకనే ప్రచారం కోసమని వైసీపీ నుండి మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు వీధివీధిలో తిరుగుతున్నారు.

ఇదే సమయంలో చంద్రబాబునాయుడు, లోకేష్, ఎంపిలు, ఎంఎల్ఏలు, సీనియర్ నేతలు రోడ్డుషోలు, వీధి ప్రచారంలో బాగా కష్టపడుతున్నారు. ఇదే పద్దతి పోలింగ్ వరకు కంటిన్యు అయితే ఎన్నికల్లో డబ్బు ప్రస్తావనలేని ఎన్నికగా రికార్డు సృష్టించటం ఖాయమనే అనిపిస్తోంది. ఇదే జరిగితే గొప్ప శుభపరిణామమనే చెప్పుకోవాలి. మరి చివరలో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.