జ‌న‌సేన‌కు సీనియ‌ర్ నేత రిజైన్‌.. సీరియ‌స్ కామెంట్స్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ పార్టీ ‌జనసేనకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మేధావిగా గుర్తింపు పొందిన మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొన్నాళ్ల కింద‌ట‌.. సీబీఐ మాజీ జేడీ.. వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ ఇదే జ‌న‌సేన‌కు రిజైన్ చేశారు. గ‌త 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న విశాఖ ప‌ట్నం ఎంపీగా జ‌న‌సేన టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత ప్ర‌జ‌ల్లోనే ఉంటాన‌ని.. చెప్పినా.. పార్టీ విధానాలు న‌చ్చ‌క‌పోవ‌డం.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తిరిగి సినీ అరంగేట్రం చేయ‌డంతో విముఖ త వ్య‌క్తం చేస్తూ.. పార్టీ నుంచి దూర‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో ఆయ‌న కొన్ని ప్ర‌శ్నలు సంధించారు. అయితే.. వాటికి అప్ప‌ట్లో జ‌న‌సేనాని ప‌వ‌న్ స‌మాధానం చెప్పేలేదు.

కానీ, ఇప్పుడు జ‌న‌సేన‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు.. మాదాసు గంగాధ‌రం.. కూడా అవే రీజ‌న్ల‌తో పార్టీకి దూర‌మ‌వ‌డం.. విస్మ‌యం వ్య‌క్తమవుతోంది. పార్టీలో తనకు సముచిత గౌరవం ఇవ్వడంలేదని త‌న రిజైన్ లేఖ‌లో మాదాసు ఆవేదన వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. పవన్ పిలుపుతో మూడేళ్ల క్రితం తాను జనసేనలో చేరినట్లు తెలిపారు. పార్టీలో కొంతమందికి సముచిత గౌరవం ఇస్తూ పార్టీ బలోపేతానికి కష్టపడే వారిని పవన్ పట్టించుకోవడంలేదని గంగాధరం వాపోయారు. ఇంతవ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇత‌ర పార్టీల్లోనూ ఇలాంటి స‌మ‌స్య‌లే ఉన్నాయ‌ని.. స‌రిపెట్టుకునే అవ‌కాశం ఉంది.

కానీ.. ఇంత‌కుమించి.. అన్న‌ట్టుగా గంగాధ‌రం వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పటివరకూ పార్టీ నిర్మాణంపై పవన్ దృష్టి పెట్టలేదని, అన్ని స్థాయిల్లో పార్టీకి కమిటీలు వేయలేదని మాదాసు పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వం, గ్రామ కమిటీల ఏర్పాటు లేకుండానే కొన్ని ప్రాంతాల్లో క్రియాశీల సభ్యత్వం చేయించ‌డాన్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంద‌న్నారు. పార్టీ విధివిధానాలు కూడా ఖరారు చేయలేద‌న్నారు. “పవన్ పోటీ చేసిన గాజువాకలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చాలా ఎక్కువగా ఉన్నారు. వారికి అండగా నిలవాల్సిన బాధ్యత పవన్‌ పై ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై బీజేపీ పెద్దల నుంచి స్పష్టమైన హామీ తీసుకోలేదు.” అని దుయ్య‌బ‌ట్టారు.

సినిమా ప్రపంచం వేరని, రాజకీయ ప్రపంచం వేరని.. ఈ రెండింటికీ తేడా తెలియకుండా వ్యవహరిస్తే త‌న‌వంటి సీనియర్లు ప‌వ‌న్‌తో కలిసి పని చేయలేరని మాదాసు వ్యాఖ్యానించ‌డం పార్టీలో అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల‌ను స్ప‌ష్టం చేస్తున్నాయి. జనసేన ఓ రాజకీయ పార్టీగా పని చేయడం లేదన్నారు. పార్టీలో ఒక్కరికి మినహా మిగతా వ్యక్తులకు విలువ లేకుండా చేయడం సమంజసం కాదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నాని మాదాసు గంగాధరం లేఖలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌స్తుతం ఈ లేఖ‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీనికి ప‌వ‌న్ స‌మాధానం ఇస్తారో.. లేక మౌనం పాటిస్తారో చూడాలి.