తెలుగు ప్రజలెంతో ఆసక్తిగా ఎదురు చూసిన పవన్ కల్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ చిత్రం విడుదల కావటం.. ఆయన ఇమేజ్ ఎంతన్న విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లకు పోటెత్తిన అభిమానుల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. కోవిడ్ వేళ.. కేసులు ఓపక్క పెరిగిపోతున్నా.. చంటి పిల్లల్ని తీసుకొని సినిమా హాల్ కు వచ్చిన కుటుంబాల్ని చూస్తే.. నటుడిగా పవన్ కున్న ఇమేజ్ ఎంతన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. వకీల్ సాబ్ సినిమాకు పాజిటివ్ టాక్ రావటం.. కలెక్షన్ల వరద ఖాయమన్న అంచనా వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉండగా.. మిగిలిన చిత్రాలకు భిన్నంగా పవన్ తాజా సినిమాకు ఫ్యాన్స్ షోలను అనుమతించకపోవటం.. టికెట్ ధరను పెంచుకునే అవకాశాన్ని హైకోర్టు ఇచ్చినప్పటికి.. అందుకు విరుద్ధంగా వ్యవహరించటం ద్వారా ఏపీ సర్కారు ప్రతీకార చర్యకు పాల్పడినట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాల్ని వ్యక్తిగత అంశాలపై ఫోకస్ పెట్టిన జగన్ సర్కారు తీరుపై పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన సినిమాలకు బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చే జగన్ ప్రభుత్వం.. పవన్ సినిమాకు ఇవ్వకపోవటం ఏమిటన్న ప్రశ్నను సంధిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. వకీల్ సాబ్ చిత్రానికి ఎదురవుతున్న ఇబ్బందుల్ని.. జగన్ సర్కారు తీరును తాజాగా ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టటం ఆసక్తికరంగా మారింది. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా తాను హాజరైన రోడ్ షోలో పవన్ సినిమాను ప్రత్యేకంగా ప్రస్తావించారు. పవన్ సినిమాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. దేశమంతా అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే.. ఏపీలో మాత్రం రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని.. జగన్ నిర్వాకాలకు పవన్ కూడా బాధితుడు అయ్యారన్నారు.
పెద్ద హీరోల సినిమాలు విడుదలైన సందర్భాల్లో ప్రత్యేక షోలు వేయటం ఆనవాయితీగా వస్తోందని.. తాము అధికారంలో ఉన్నప్పుడు అందరికి అనుమతులుఇచ్చామని.. రిలీజ్ అయిన తొలినాళ్లలో కోర్టు చెప్పినట్లు టికెట్ల ధరల్ని పెంచుకోవటానికి అనుమతించామన్నారు. కానీ.. జగన్ సర్కారు పవన్ సినిమాకు ఆ అవకాశం ఇవ్వలేదన్నారు. “పవన్ పై ఎందుకంత కక్ష? మీ ఆరాచకాల్ని ప్రశ్నిస్తున్నారనేనా? ప్రభుత్వ వైఫల్యాల్ని నిలదీస్తున్నారనేనా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు కూడా లేదా? ఇంకా ఎంతకాలం మీ దుర్మార్గం?” అంటూ ప్రశ్నించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
2014 ఎన్నికల్లో టీడీపీ.. జనసేన.. బీజేపీలు కలిసి పోటీ చేసి అధికారాన్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. తర్వాతి కాలంలో ఈ పొత్తుకు కాలం చెల్లి ఎవరి దారి వారు అన్నట్లుగా ఉంటున్నారు. కొంతకాలంగా జనసేన.. బీజేపీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. అయితే.. బీజేపీ తన విషయంలో మర్యాదపూర్వకంగా వ్యవహరించకపోవటం.. మిత్రపక్షంగా ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోవటంపై పవన్ గుర్రుగా ఉన్నారు.
ఇలాంటివేళలో.. వరుస ఎదురుదెబ్బలతో రాజకీయంగా తీవ్ర ప్రతికూలతల్ని ఎదుర్కొంటున్న చంద్రబాబు.. తాజాగా పవన్ కు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. వకీల్ సాబ్ చిత్రం విషయంలో జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం.. అనుసరించిన విధానాలు రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామాలకు అవకాశం ఇస్తుందన్న మాట వినిపిస్తోంది.