ఆ పార్టీతో జ‌గ‌న్ ఫ్రెండ్ షిప్‌…!

హైద‌రాబాద్ కేంద్రంగా పురుడు పోసుకున్న ఎంఐఎం పార్టీ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా మైనార్టీలు ఉన్న ప‌లు ప్రాంతాల‌పై దృష్టి పెట్టింది. హైద‌రాబాద్‌తో పాటు మ‌హారాష్ట్ర‌లోని ఔరంగాబాద్ ఎంపీ స్థానం కూడా కైవ‌సం చేసుకున్న ఎంఐఎం ప‌లు రాష్ట్రాల అసెంబ్లీలోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. బిహార్ అసెంబ్లీలో ఏకంగా ఐదుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక తాజాగా బెంగాల్ ఎన్నిక‌ల్లోనూ ఎంఐఎం రంగంలోకి దిగింది. విచిత్రం ఏంటంటే గుజ‌రాత్‌లోనూ గెలిచి బీజేపీకి షాక్ ఇచ్చింది. ఇత‌ర రాష్ట్రాల్లో ఎంఐఎం ఓట్లు చీలుస్తుండ‌డంతో బీజేపీ భారీగా లాభ‌ప‌డుతోన్న ప‌రిస్థితి. దేశ‌వ్యాప్తంగా ఎంఐఎం విస్త‌రించుకుంటూ పోతోంది.

ఇక పొరుగునే ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై మాత్రం ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఇప్ప‌టి వ‌ర‌కు దృష్టి పెట్ట‌లేదు. ఏపీలోనూ క‌ర్నూలు, విజ‌య‌వాడ‌, గుంటూరు, వైజాగ్ లాంటి న‌గ‌రాల్లో మైనార్టీలు ఎక్కువ‌గానే ఉన్నారు. ఇటీవ‌ల స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఎంఐఎం పోటీ చేసినా పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు. హిందూపురం లాంటి చోట్ల మాత్రం ఒక‌టీ, అరా కౌన్సెల‌ర్ సీట్లు గెలుచుకుంది. మైనార్టీ ఓటు బ్యాంకులో వైసీపీ సానుభూతిప‌రులే ఎక్కువుగా ఉన్నారు. వీరికి జ‌గ‌న్ అమ‌లు చేస్తోన్న సంక్షేమ ప‌థ‌కాల నేప‌థ్యంలోనూ జ‌గ‌న్ ప‌ట్ల ఇష్టంగా ఉన్నారు. ఒక వేళ ఎంఐఎం ఏపీపై కూడా ప్ర‌ధానంగా దృష్టి సారిస్తే ముస్లింల ఓట్లు భారీగా చీలిపోవ‌డం ఖాయం.

వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ త‌న‌కు తిరుగులేని విజ‌యం కావాల‌ని ఇప్ప‌టి నుంచే అనేక ప్ర‌ణాళిక‌ల‌తో వెళుతోన్న సీఎం జ‌గ‌న్ భ‌విష్య‌త్తులో ఎంఐఎంతో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసేందుకు చ‌ర్య‌లు ప్రారంభించేశార‌ట‌. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏపీలో ఎంఐఎం పోటీ చేయ‌కుండా ఉండేందుకు… ఎంఐఎంను ఇప్ప‌టి నుంచే క‌ట్ట‌డి చేసేందుకు గాను ఏపీకి చెందిన వైసీపీ పెద్ద‌లు.. సీఎం జ‌గ‌న్ డైరెక్ష‌న్‌లో ఇటీవ‌లే ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఓవైసీని క‌లిశార‌ట‌. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాక మైనార్టీల‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నార‌ని… మైనార్టీల‌కు ఎక్కువ ఎమ్మెల్సీలు ఇచ్చార‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాజ‌కీయ నేత ఇవ్వ‌ని విధంగా ఇద్ద‌రు మైనార్టీ మ‌హిళ‌ల‌ను ఎమ్మెల్సీల‌ను చేశారని చెప్పార‌ట‌.

వీరు జ‌గ‌న్ ప్ర‌భుత్వం మైనార్టీల‌కు ఏ సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తోంది ? ఏయే ప‌ద‌వులు ఇచ్చింది ? స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఎలా ప్ర‌యార్టీ ఇచ్చింద‌న్న విష‌యాన్ని గ‌ణాంకాల‌తో స‌హా ఓవైసీకి వివ‌రించార‌ట‌. ఈ లెక్క‌లు చూశాక ఆయ‌న కొంత సంతృప్తి చెందినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం.. చేక‌పోవ‌డంపై వారికి ఏం హామీ అయితే ఇవ్వ‌లేదంటున్నారు. ఏదేమైనా జ‌గ‌న్ ఎంఐఎంను ఇప్ప‌టి నుంచే దువ్వే కార్య‌క్ర‌మం అయితే ప్రారంభించారు.