ఎవరిని ఎలా డీల్ చేయాలో కేసీఆర్ కే తెలుసు

గురి తప్పకుండా కొట్టటం మామూలు విషయం కాదు. పాలకుడిగా ఉన్న వేళ.. మంది మనోభావాలు దెబ్బతినకుండా.. తాను చెప్పినట్లుగా పనులు జరగాలన్న ఆశ అందరిలోనూ ఉంటుంది. కానీ.. అదంత తేలికైన విషయం కాదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు భిన్నమైన స్పందన వస్తుంటుంది.

ఇలాంటి వాటిని ఎదుర్కొనటమే కాదు.. కిమ్మనకుండా ఉండేలా చేయటం అంత తేలికైన పని కాదు. అసాధ్యమైనది ఏదీ సారుకు ఉండదు. చేతిలో అధికారమే లేని వేళ.. రాదనుకున్న తెలంగాణనే తెచ్చేసిన సారుకు.. పవర్లో ఉన్న వేళ.. తనకు నచ్చినట్లుగా పనులు చేయించుకోవటం చేతకాదా ఏమిటి?

తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన చూస్తే.. ఈ విషయం అర్థం కావటమే కాదు.. ఎప్పుడు.. ఎవరిని.. ఎలా డీల్ చేయాలన్న విషయంపై తనకున్న లెక్కను చేతల్లో మరోసారి చూపించారని చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఎవరు ఏ పంట వేయాలన్నది పెద్ద ప్రశ్న. దీనికి సీఎం కేసీఆర్ వద్ద సమాధానం రెఢీ గా ఉంది. ఏ ప్రాంతానికి చెందిన వారు ఏ పంట వేయాలన్న విషయం మీద ఆయన వద్ద బ్లూ ప్రింట్ ఉన్నప్పటికీ.. ఆచరణలో అంత తేలికైన విషయం కాదు.

పండించే పంట విషయంలోనూ మాకు స్వేచ్ఛ లేదా? మాకు తోచిన పంట వేస్తాం? ప్రభుత్వం చెప్పేదేమిటంటూ మాట్లాడేవారు బోలెడంత మంది. కానీ.. అలాంటి మాట నోటి వెంట రాకుండా ఉండేలా చేశారు కేసీఆర్. తాజాగా విడుదల చేసిన ప్రకటనతో అదరగొట్టేశారు.

ఎవరు ఏ పంట వేయాలన్న దానిపై సుదీర్ఘంగా మంతనాలు సాగించిన ఆయన.. తెలంగాణ వ్యాప్తంగా.. వేర్వేరుప్రాంతాల్లో వేర్వేరు పంట వేయటం ద్వారా.. భారీ దిగుబడితో పాటు.. పంట పండించిన రైతుకు మంచి ధర లభించేలా చేయాలన్నది కేసీఆర్ ఆలోచన.

ఇందులో భాగంగా తాజాగా చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం ఏ పంట వేయాలని కోరుతుందో.. ఆ పంటను మాత్రమే వేయాలని.. ఒకవేళ ప్రభుత్వ ప్రకటనకు భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం.. రైతులకు ఇచ్చే రైతుబంధు సాయాన్ని ఆపివేస్తామని పేర్కొన్నారు. అంతేకాదు.. సర్కారు మాట వినకుండా పంట వేసిన వారి వద్ద మద్దతు ధరకు కొనుగోలు చేయకూడదని కూడా డిసైడ్ చేశారు.

దీంతో.. పంటను ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు పండించకుండా.. ప్రభుత్వం చెప్పినట్లే పండించేలా సారువేసిన ఎత్తు అదిరిపోయిందన్న మాట వినిపిస్తోంది. తాను చెప్పినట్లుగా పంట వేసి.. ఒక్క ఏడాది దాని ఫలాలు రుచిచూస్తే.. తర్వాత నుంచి ప్రభుత్వం చెప్పినట్లే రైతులు చేస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి ఎక్కడ లింకు పెడితే పని అవుతుందో సారుకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదని మాత్రం చెప్పక తప్పదు.