తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. మొన్నటివరకు జనసేనను ఓ పార్టీగాను, అధినేత పవన్ కల్యాణ్ణు రాజకీయ నేతగా కూడా గుర్తించటానికి బీజేపీ నేతలు ఇష్టపడలేదన్నది వాస్తవం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణా అధ్యక్షుడు బండి సంజయ్ జనసేన అధినేతపై చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. అలాంటిది ఇపుడు ఏపి బీజేపీ చీఫ్ సోమువీర్రాజుతో సహా చాలామంది నేతలు పాహిమాం పాహిమాం అంటు పవన్ ముందు సాగిలపడుతున్నారు.
సరే అవసరాలే వారితో అలా చేయిస్తోందని సరిపెట్టుకుందాం. ఎందుకంటే రేపు పవన్ తో ఉపయోగంలేదని అనుకున్న మరుక్షణం వారి డైలాగులు ఎలాగుంటాయో ఎవరైనా ఊహించగలరు. కానీ 30 ఏళ్ళు ఆల్ ఇండియా సర్వీసు అధికారిగా పనిచేసి బీజేపీ అభ్యర్ధిగా మారిన రత్నప్రభ వ్యవహరం కూడా విచిత్రంగానే ఉంది. తిరుపతి, సత్యవేడులో బీజేపీ+జనసేన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నట్లున్నారు.
సమావేశం తర్వాత రత్నప్రభ ఓ ట్వీట్ చేశారు. అందులో తన పిల్లలు, పవన్ కల్యాణ్ అభిమానులతో కలిసి వకీల్ సాబ్ ట్రయల్ చూశారట. తప్పులేదు మనం ఇళ్ళల్లో కూర్చున్నపుడు కూడా టీవీల్లో ట్రయలర్స్ చూస్తునే ఉంటాం. ట్రయలర్ చాలా ఎక్సైటింగ్ గా ఉందట. ‘లుకింగ్ ఫార్వార్డ్ టు సీ ది క్రానికల్స్ ఆఫ్ వకీల్ సాబ్’ అని ట్వీట్ చేశారు. అభ్యర్ధి తాజా ట్వీట్ చూసిన తర్వాత ఆమె పవర్ స్టార్ కు వీరాభిమాని అయిపోయారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఆమె ట్వీట్లు దేనికోసమో అందరికీ తెలిసిందే. తిరుపతి లోక్ సభ పరిధిలో రెండుపార్టీల బలాబలాలు ఏమిటో చాలామందికి తెలుసు. మరి నేతలకు తెలిసిన విషయం అభ్యర్ధికి తెలీదేమో. అందుకనే పవన్ వీరాభిమాని లాగ ఆమె కూడా వకీల్ సాబ్ కోసమని ఓ ట్వీట్ పెట్టేశారు. నిజంగా ఇదంతా పవన్ మీద అభిమానమేనా ? లేకపోతే ఎన్నికల్లో ఓట్ల అభిమానమా ? తొందరలోనే తేలిపోతుంది కదా విషయం ఏమిటో ?
Gulte Telugu Telugu Political and Movie News Updates