టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో వైసీపీ రాజకీయాలు ఊపందుకున్న విషయం తెలిసిందే. ఇక్కడి పుంగనూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి.. వైసీపీ తరఫున చక్రం తిప్పుతున్నారు. బాబు గుర్తులు చెరిగిపోయేలా.. జగన్ దగ్గర మంచి మార్కులు పొందేలా పెద్దిరెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చూపించారు. టీడీపీకి కేరాఫ్ లేకుండా చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. మునిసిపాలిటీల పదవుల విషయంలో మంత్రి ఒకటి తలిస్తే.. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మరొకటి తలచినట్టుగా మారిపోయింది సీన్. దీంతో పెద్దిరెడ్డికి చెక్ పెట్టేందుకే జగన్ ఇలా చేశారంటూ.. విశ్లేషణలు వస్తుండడం గమనార్హం.
ఏం జరిగింది ?
మున్సిపాలిటీ,కార్పొరేషన్ల పదవుల ఎన్నికల్లో పెద్దిరెడ్డి మాట చెల్లుబాటు కాకపోవడం రాజకీయ చర్చకు దారితీసింది. సొంత జిల్లాలోనే ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఎన్నికలు జరిగిన చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లతో పాటు మదనపల్లె, పలమనేరు, నగరి, పుత్తూరు మున్సిపాలిటీల్లో ఆయన వర్గంగా చెప్పుకునే వారికి పదవులు దక్కలేదు. ఒక్క పుంగనూరులో మాత్రమే ఆయన వర్గానికి అవకాశం దక్కింది. చిత్తూరు మేయర్ ఎంపికలో పెద్దిరెడ్డి వర్గీయులైన బుల్లెట్ సురేష్, విజయానందరెడ్డి వర్గానికే మేయర్ పదవి దక్కుతుందని జోరుగా ప్రచారం సాగింది. చివరకు సీఎం జగన్ చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు బలపరిచిన ఆముదను మేయర్ పదవికి ఎంపికచేశారు.
మదనపల్లెలో భారీ షాక్..!
మదనపల్లెలో మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు, ఎంపీ మిధున్ రెడ్డిల ప్రధాన అనుచరుడు జింకా చలపతి భార్య రాధమ్మను చైర్ పర్సన్‌గా ఎంపిక చేస్తారని అంతా భావించారు. అయితే మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా తన స్నేహితుడు కిరణ్ రెడ్డి భార్యకు చైర్ పర్సన్ పదవి దక్కింది. తిరుపతి కార్పొరేషన్,పలమనేరు, పుత్తూరు,నగరి మున్సిపాలిటీల్లోనూ స్థానిక ఎమ్మెల్యేలు తమ వర్గాలకు పదవులు దక్కించుకున్నారు.
నగరి నియోజకవర్గంలో రోజా చక్రం తిప్పి పెద్దిరెడ్డి వర్గానికి పదవులు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ వ్యవహారాన్ని గమనించిన వారికి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి హవా తగ్గించేందుకు నగరి, మదనపల్లె, తిరుపతి, చంద్రగిరి, చిత్తూరు ఎమ్మెల్యేలు చక్రం తిప్పారన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు అధిష్టానం దగ్గర కూడా ఆయనకు ప్రాధాన్యం తగ్గిపోతోందని గుసగుసలు వినిపిస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates