4 ల‌క్ష‌లు… కాదు.. 5 ల‌క్ష‌లు.. ఈ బెట్టింగులు ఎవ‌రి కోస‌మే తెలుసా?

4 ల‌క్ష‌లు ఖాయం అన్నా.. అని ఒక‌రు అంటే.. కాదు త‌మ్ముడూ.. 5ల‌క్ష‌లు దాటుద్ది!-అని అటు నుంచి మ‌రొక‌రు.. ఇదీ.. ఇప్పుడు తిరుప‌తి పార్ల‌మెంటు స్థానం ఉప ఎన్నిక‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయ నేత‌లు, బెట్టింగురాయుళ్ల మ‌ధ్య జ‌రుగుతున్న సంభాష‌ణ‌. ఒక‌ప్పుడు క్రికెట్ కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన బెట్టింగులు ఇప్పుడు… రాజ‌కీయాల‌కు కూడా విస్త‌రించాయి. ఆ మాట‌కొస్తే.. 2019 ఎన్నిక‌ల్లో ఈ త‌ర‌హా బెట్టింగులు జోరుగా సాగాయి. అనంత‌పురం జిల్లా రాప్తాడు నియోక‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన ప‌రిటాల ర‌వి వార‌సుడు ప‌రిటాల శ్రీరాం.. మెజారిటీపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే విధంగా బెట్టింగులు ‌న‌డిచాయి.

ఇక‌, ఇప్పుడు ఇదే త‌ర‌హాలో తిరుప‌తి ఉప ఎన్నిక‌లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేస్తున్న డాక్ట‌ర్ గురుమూర్తి మెజారిటీపై కూడా బెట్టింగుల ప‌ర్వం జోరందుకుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. ఇలా బెట్టింగులు కాస్తున్న వారంతా కూడా వైసీపీ అభిమానులేన‌ని.. వీరిలో కొంద‌రు ఎన్నారైలు కూడా ఉన్నార‌ని.. అంటున్నారు. ప్ర‌స్తుతం తిరుప‌తిలోని ఏ ఒక్క హోట‌ల్ కూడా ఖాళీ లేదు. దాదాపు 50 మంది వ‌ర‌కు బెట్టింగు రాయుళ్ల త‌ర‌ఫున ప‌రిశీల‌కులు అక్క‌డ మ‌కాం వేసి.. ఎన్నిక‌ల స‌ర‌ళిని ప‌రిశీలిస్తున్నారు. ఇంత‌కీ ఒక ఉప ఎన్నిక‌కు సంబంధించి ఇంత ఊపు ఎందుకు వ‌చ్చింది? అంటే.. సీఎం జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌నే కార‌ణ‌మ‌ని అంటున్నారు.

ఇటీవ‌ల త‌న పార్టీ నేత‌ల‌తో భేటీ అయిన సీఎం జ‌గ‌న్‌.. తిరుపతిలో గెలుపు కాద‌ని.. దేశం మొత్తం తిరుప‌తి వైపు చూసేలా.. తిరుప‌తి గురించి చ‌ర్చించుకునేలా చేయాల‌ని నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశారు. అంటే… గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి గెలిచిన బ‌ల్లి దుర్గా ప్ర‌సాద‌రావు.. 2 ల‌క్ష‌ల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, ఇప్పుడు మాత్రం ఈ మెజారిటీ డ‌బుల్ కావాల‌నేది జ‌గ‌న్ వ్యూహంగా ఉంది.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ దిశానిర్దేశం త‌ర్వాత‌.. అనూహ్యంగా తిరుప‌తి పార్ల‌మెంటు పోరుపై బెట్టింగ్ రాయుళ్ల క‌న్నుప‌డింది. ఇక్క‌డ మెజారిటీ జ‌గ‌న్ కోరుకుంటున్న‌ట్టు 4 ల‌క్ష‌లు దాటుతుంద‌ని కొంద‌రు భావిస్తున్నారు. మ‌రికొంద‌రు.. ఏకంగా 5 ల‌క్ష‌ల మెజారిటీ ఖాయ‌మ‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఎవ‌రికి తోచిన‌ట్టు వారు బెట్టింగులు క‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి చివ‌రకు ఏం జ‌రుగుతుందో చూడాలి.