ఆంధ్రుల హక్కు సెంటిమెంటుగా మారిన విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తుండడం , దీనికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉందనే ప్రచారం జరుగుతుండడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన, ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో విశాఖలో మరోసారి కార్మికులు, ప్రజలు కూడా ఉద్యమిస్తున్నారు. ఉక్కు పరిశ్రమను ఎట్టిపరిస్థితిలోనూ ప్రైవేటీకరించడానికి వీల్లేదని వీళ్లు గర్జిస్తున్నారు. ఇక, వీరి ఉద్యమానికి అధికార పార్టీ సహా అన్ని పార్టీలు, నేతలు, మేధావి వర్గాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఈ క్రమంలో పార్టీల వైఖరిపైనా.. కేంద్రంలోని ప్రధాని మోడీ వ్యవహారంపైనా విమర్శలు సంధిస్తున్నారు.
ఇంత వరకు బాగానే ఉన్నా.. కొందరు మేధావులు, నేతలు.. కొన్ని వర్గాలకు చెందిన వారు… మాత్రం ఈ విషయంలోకి ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడును లాగుతున్నారు. నాటి ఉక్కు ఉద్యమ సమయంలో ఎంతో చురుగ్గా ఉద్యమంలో పాల్గొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు మౌనం వహించడం బాధాకరమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంకొందరు.. ఆయన తన పదవికి రాజీనామా చేసి ఉక్కు ఉద్యమంలో భాగం కావాలనే వాదనను కూడా తెరమీదికి తెస్తున్నారు. అయితే.. ఈ విషయంలో కొన్ని పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తుండగా.. మరికొందరు మాత్రం ఉపరాష్ట్రపతిని ఈ విషయంలోకి లాగే ప్రయత్నం జోరుగానే చేస్తున్నారు.
అయితే… ఇలా ఒక ఉపరాష్ట్రపతిని ఉద్యమంలోకి లాగే ప్రయత్నం చేయడం ఏమేరకు సమంజసం అనే వ్యాఖ్యలు మేధావి వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. అలాంటి ఉపరాష్ట్రపతిని విమర్శించడం సరికాదు. అయితే.. ఏదైనా సమస్య ఉంటే.. నేరుగా ఆయన వద్దకు వెళ్లి ఓ వినతి పత్రం ఇవ్వచ్చు. లేదా రాజ్యసభలో దీనిపై చర్చ జరిగేలా.. మన రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులపై ఒత్తిడి తేవచ్చు. తద్వారా కేంద్రానికి గట్టి సందేశం ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతే తప్ప.. నోటికి వచ్చినట్టు వ్యాఖ్యానించడం.. రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్న వారిపై వ్యాఖ్యలు చేయడం సరికాదు
అని అంటున్నారు..
వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ఉపరాష్ట్రపతికి పాత్ర ఏమీ ఉండదు.. అలా అనుకుంటే. కేవలం కేంద్ర కేబినెట్‌కు మాత్రమే తెలిసే ఛాన్స్ ఉంటుంది. అంతేతప్ప.. ఉపరాష్ట్రపతిని అనుకుని ప్రయోజనం ఏంటి? మన గోడు వినేందుకు మన తెలుగు వాడిగా .. ఒకరు ఢిల్లీలో కీలక పదవిలో ఉన్నందుకు గర్వించాలే తప్ప.. అనే కామెంట్లు కూడా వస్తున్నాయి. మరి ఇప్పటికైనా ఉద్యమ నాయకులు రాజకీయ నేతల వైఖరిని వదిలేసి.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకుంటారో లేదో చూడాలి.