తిరుపతి పార్లమెంటు స్థానానికి సంబంధించిన ఉప ఎన్నికలో బీజేపీ వ్యూహాలపై వ్యూహాలు వేస్తోంది. ఇక్కడ గెలవాలనే పట్టుతో ఉన్న కమల నాథులు ఎలాంటి వ్యూహాలు వేసినా.. అంతిమంగా వర్కవుట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తమ మిత్ర పక్షం జనసేన అధినేత పవన్‌ను ఇక్కడ ప్రచారానికి పిలిచి ఒప్పించాలని నిర్ణయించుకుంది. వాస్తవానికి ఇక్కడ నుంచి పోటీ చేయాలని భావించిన పవన్ .. బీజేపీ పెద్దల ఒత్తిడితో పోటీ నుంచి తప్పుకొని బీజేపీకే అవకాశం కల్పించారు. సీటునైతే దక్కించుకున్న బీజేపీ.. గెలుపు వ్యూహంలో వెనుకబడింది.
ఈ క్రమంలో పవన్‌పైనే ఆశలు పెట్టుకున్నామంటూ.. మీడియాకు లీకులు ఇస్తూ.. సెంటిమెంటును రాజే స్తోంది. అంటే.. తిరుపతి గెలుపు ఇక, తమ చేతుల్లో లేదని.. పవన్‌పైనే ఆధారపడి ఉందని బీజేపీ దాదాపు చెప్పకనే చెప్పేసింది. ఇక, ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగనున్న రత్నప్రభ కూడా పవన్‌ను కలిసి.. ప్రచారం చేయాలని అభ్యర్థించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. దూరదృష్టితో చూస్తే.. మాత్రం బీజేపీ నేతలు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఇక్కడ పవన్ ప్రచారం చేసినా.. తాము ఓడిపోతే.. ఇది తమ ఖాతాలో కంటే.. పవన్ ఖాతాలోకే ఎక్కువగా వెళ్లనుంది.
అంటే.. ఓడిపోతే.. పవన్ ప్రచారం కలిసి రాలేదనే వాదనను కమల నాథులు తెరమీదికి తెస్తారు. అది కూడా ఎప్పుడంటే.. రేపు పవన్ కనుక.. బీజేపీతో తెగతెంపులు చేసుకుని.. బయటకు వస్తే.. పవన్ పై యాంటీ ప్రచారం చేసుకునేందుకు బీజేపీకి తిరుపతి ఒక సబ్జెక్టుగా మారడం ఖాయమని తెలుస్తోంది. ఒక వేళ గెలిస్తే.. ప్రధానమంత్రి పథకాలు, బీజేపీ ఎదుగుదల.. ప్రజల్లో మార్పు వంటివి బాగా పనిచేస్తున్నాయని చెప్పు కొనేందుకు కమలనాథులు వెనుకాడే పరిస్థితి లేదు. అంటే.. పవన్‌ను ప్రచారానికి పిలవడం వరకు బాగానే ఉన్నా.. తర్వాత జరిగే పరిణామాలకు పూర్తిగా పవన్‌ను కేంద్రం చేసే అవకాశం మెండుగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
ప్రస్తుతం జనసేన నాయకులు కూడా ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. రేపు బీజేపీ ఓడితే.. తమ నెత్తిన ఈ ఓటమినిరుద్దే ప్రయత్నం చేయడం ఖాయమని ఈ పార్టీలోనూ తర్జన భర్జన సాగుతోంది. గెలుపుపై జనసేనలోనూ పెద్దగా ఆశలు లేక పోవడం ఇక్కడ కొసమెరుపు. మొత్తంగా చూస్తే.. తిరుపతి ఉప ఎన్నిక విషయంలో పవన్ ఇక్కడితో ఆగిపోతేనే బెటర్ అనే సూచనలు వస్తున్నాయి. అంటే.. టికెట్ వదులుకుని కొంత సింపతీ సంపాయించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రచారంలోకి దిగితే.. అది కాస్తా పోవడం ఖాయమనే విశ్లేషణలు వస్తున్నాయి. మరి ఏం చేస్తారోచూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates