ఆర్కే మాటలు వింటే.. ‘అల వైకుంఠపురం’ సీన్ గుర్తుకు వస్తుంది


ఏడాది క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ అల వైకుంఠపురం సినిమాను అంత త్వరగా మర్చిపోలేం. అందులో.. హీరో తండ్రి కంపెనీ మీద కన్నేసిన ఒక పోర్టు యజమాని.. ఎంతలా భయపెడతారో.. కంపెనీని సొంతం చేసుకోవటానికి ఎంత వరకు వెళతాడో చూసిందే. అంతలా కాకున్నా.. రక్తం చిందకుండానే మాటలతోనో.. చేతల్లో ఉన్న పవర్ తోనో సొంతం చేసుకుంటున్న వైనం ఈ మధ్యన ఎక్కువ అవుతుందా? అంటే… అవునన్న మాటను చెబుతున్నారు ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే అలియాస్ వేమూరి రాధాక్రిష్ణ. ప్రతి వారాంతంలోనూ ఆయన తన వరకు వచ్చిన విషయాల్ని.. బయట పెద్దగా ఫోకస్ కాని కొత్త అంశాల్ని తన ఆర్టికల్ లో ప్రస్తావిస్తుంటారు.

ఆయనకు చెందిన ఆంధ్రజ్యోతితో పాటు.. మిగిలిన అన్ని దినపత్రికల్లోనూ మూడు నాలుగురోజుల క్రితం ఏపీకి చెందిన గంగవరం పోర్టును గౌతం అదానీ సొంతం చేసుకున్నట్లుగా వార్త పబ్లిష్ అయ్యింది. తాజాగా తన కాలమ్ లో మరీ లోతుల్లోకి వెళ్లలేదు కానీ.. ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించి వదిలేశారు. ఆర్కే ప్రస్తావించిన అంశం ఏమిటన్నది ఆయన అక్షరాల్లోనే చూస్తే..

‘‘కంపెనీల కబ్జా విషయానికి వస్తే, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు చూసి తెలంగాణలోని పారిశ్రామికవేత్తలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. కాకినాడ సెజ్‌తో పాటు పోర్టును కూడా తమ ఆప్తులకు కట్టబెట్టిన ప్రభుత్వ పెద్దలు గంగవరం పోర్టును సైతం గుజరాత్‌కు చెందిన గౌతం అదానీ పరం చేశారు. మంచి లాభాలతో నడుస్తున్న గంగవరం పోర్టును అమ్ముకోవలసిన అవసరం పోర్టు యజమాని రాజుగారికి లేకపోయినా ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఒత్తిడితో తలవొంచక తప్పలేదు. రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అదానీ వంటి వారిని కోరాల్సింది పోయి తెలుగువారు కష్టపడి నిర్మించుకున్న పోర్టులు, కంపెనీలను ఆయనకు అప్పగించడంలో ప్రభుత్వ పెద్దలు కీలక పాత్ర పోషించడం విషాదం కాదా! ’’ అని చెప్పారు.

అంతేనా.. మరికొన్ని అంశాల్ని ఆయన ప్రస్తావించారు. ‘‘ముంబై ఎయిర్‌పోర్టుపై కన్నేసిన అదానీ అందులో వాటా కోసం ప్రయత్నించి, దాన్ని నిర్మించి నిర్వహిస్తున్న మన తెలుగువాడైన జి.వి.కృష్ణారెడ్డిపై సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించారు. చివరకు సీబీఐ, ఈడీ కేసులను తట్టుకొనే ఓపిక లేక ముంబై ఎయిర్‌పోర్టును కృష్ణారెడ్డి వదులుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం పెద్దల సహకారంతో కృష్ణపట్నం పోర్టును అదానీ తన సొంతం చేసుకున్నారు. ఇప్పుడు గంగవరం వంతు. ఇదే ధోరణి కొనసాగితే మన తెలుగువాళ్లకు చెందిన కంపెనీలన్నీ అదానీ వంటివారి పరం కాకుండా ఉంటాయా? ’’ అన్న ప్రశ్నను సంధించారు.

అయితే.. కంపెనీల దురాక్రమణకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సహకరిస్తున్నట్లుగా ఆరోపణ చేశారు. అదే నిజమనుకుంటే.. తెలంగాణకు చెందిన జీవీకే రెడ్డి సంగతేమిటి? ప్రభుత్వాల సంగతి ఎలా ఉన్నా.. తన కన్నుపడిన కంపెనీల్ని సొంతం చేసుకునే బలమైన కార్పొరేట్లు దేశంలో పెరుగుతున్నారన్నది నిజం. ఇదంతా చూసినప్పుడు అల వైకంఠపురం సినిమా సీన్ చాలా చిన్నదన్న భావన కలుగక మానదు.