మోడి పోరాటం వృధాయేనా ?

క్షేత్రస్ధాయిలో విస్తృతంగా తిరిగి నిర్వహిస్తున్న సర్వే రిపోర్టులు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానలు పెరిగిపోతున్నాయి. ఒక కేంద్రపాలిత ప్రాంతమైన పుడిచ్చేరితో పాటు నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. వీటిల్లో తమిళనాడు, కేరళలో ఎలాంటి అశలులేవు కమలనాదులకు. అందుకనే తన దృష్టియావత్తు పశ్చిమబెంగాల్ మీదే పెట్టింది. ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లాంటి అనేకమంది హేమాహేమీలు పదే పదే రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.

ఎలాగైనా సరే మమతబెనర్జీని ఓడగొట్టి బెంగాల్లో బీజేపీ జెండాను ఎగరేయాలన్న పట్టుదలతో ప్రచారం చేస్తున్నారు. నరేంద్రమోడి ఇప్పటికే నాలుగుసార్లు ప్రచారం చేశారు. ఇక అమిత్ షా అయితే పదే పదే బెంగాల్లో పర్యటిస్తున్నారు. ఇలాంటి నేపధ్యంలోనే ఒపీనియన్ పోల్స్ పేరుతో అనేక సంస్ధలు సర్వేలు చేస్తున్నాయి. వీటిల్లో అత్యధికం మమత హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. తాజాగా టౌమ్స్ నౌ-సీ ఓటర్ నిర్వహించిన ప్రీ పోల్ సర్వే రిజల్టును ప్రకటించింది.

294 అసెంబ్లీ సీట్లున్న బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ 152-168 సీట్లతో మూడోసారి అధికారంలోకి రావటం ఖాయమని తేల్చేసింది. ఇదే సమయంలో అధికారంలోకి వచ్చేసినట్లే అని కలలుకంటున్న బీజేపీకి 104-120 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చోక తప్పదట. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ బలం బాగా పుంజుకోవటమే. 2016లో కేవలం మూడుసీట్లు మాత్రమే గెలుచుకున్న పార్టీ ఐదేళ్ళల్లో 100 సీట్లకు పైగా గెలుచుకుంటుందని సర్వేల్లో తేలిందంటే మామూలు విషయంకాదు.

ఇక ఫైనల్ గా వామపక్షాలు-కాంగ్రెస్ కూటమి ప్రభావం పెద్దగా ఉండదని సర్వేల్లో తేలిపోయింది. ఈ కూటమికి 18-26 సీట్లొస్తే అదే ఎక్కువన్నట్లుగా జనాలు అభిప్రాయపడ్డారట. మమతను ప్రధానితో పాటు యావత్ కమలనాదులు ఓ బూచిగా చూపించి ప్రచారం చేస్తున్నారు. అదే స్ధాయిలో మోడి+కమలనాదులను రాష్ట్ర విరోధులుగా మమత ఎదురు ప్రచారం చేస్తోంది. మొత్తానికి స్ధానిక సెంటిమెంటును లేవదీసిన మమత గట్టిగానే ప్రచారం చేస్తోంది. మరి జనాలు ఎవరిని ఆదిరిస్తారో చూడాలి.