అచ్చెన్నాయుడు సెల్ఫ్ గోల్ వేసుకున్నారా?

మాజీమంత్రి, టీడీపీ అద్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అనవసరంగా కెలుక్కున్నారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై రెఫరెండం కాదని అచ్చెన్న తనంతట తానుగా ప్రకటించారు. ఇక్కడే అచ్చెన్న వ్యవహారశైలిపై పార్టీలోనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. విషయం ఏమిటంటే తిరుపతి ఉపఎన్నికను జగన్ పాలనపై రెఫరెండమని ఎవరు చెప్పలేదు, అడగలేదు.

పంచాయితి ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లేసి జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తం చేయాలని చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపు ఏమైందో అందరు చూసింది. అంతటితో ఆగకుండా మున్సిపాలిటిల్లో అందరు టీడీపీకి ఓట్లేసి వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను చాటి చెప్పాలని మళ్ళీ చంద్రబాబు పిలుపిచ్చారు. ఫలితం ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే.

విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లలో వైసీపీకి ఓట్లేస్తే అమరావతిని తరలించేందుకు అనుమతి రాసిచ్చేసినట్లే అని చంద్రబాబు నెత్తీ నోరు మొత్తుకున్నారు. అమరావతి సెంటిమెంటును తెలిసేట్లుగా టీడీపీని అత్యధిక మెజారిటితో గెలిపించాలని చంద్రబాబు ఎంతగా చెప్పినా జనాలు పట్టించుకోలేదు. కళ్ళముందే టీడీపీ దీనపరిస్ధితిని చూసిన తర్వాత ఎవరైనా తిరుపతి ఉపఎన్నికను రెఫరెండమని సవాలు చేయగలరా ?

అలాంటిది వైసీపీ తరపున ఎవరు అడగకుండానే అచ్చెన్న తనంతట తానుగానే రెఫరెండం కాదని ఎందుకు అనవసరంగా కెలుక్కున్నారో అర్ధం కావటంలేదు. అచ్చెన్న ప్రకటనరాగానే ఎన్నికకు ముందుగానే టీడీపీ చేతులెత్తేసిందని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. జనాలు కూడా ఇలాగే అనుకుంటే అది పూర్తిగా అచ్చెన్న తప్పిదమే అవుతుంది. ఎలాగు గెలుపు అవకాశం లేని ఉపఎన్నికలో టీడీపీ తన వ్యూహాలేమిటో తాను అమలు చేసుకుంటే సరిపోయేది. అనవసరంగా రెఫరెండం అంటు ప్రస్తావించి అచ్చెన్న సేమ్ సైడ్ గోలు వేసుకున్నారా ? అనే డౌటు పెరిగిపోతోంది.