ఈ ఆలోచ‌న‌ మ‌న‌కెందుకు రాలేదు… టీడీపీ అంత‌ర్మ‌థ‌నం!

Chandrababu

చేతులు కాలిపోయిన త‌ర్వాత‌.. చిందులు వేసిన‌ట్టుగా ఉంది.. టీడీపీ నేత‌ల ప‌రిస్థితి. ప్ర‌జాస్వామ్యంలో వ్య‌క్తుల‌ను న‌మ్ముకునే క‌న్నా.. ప్ర‌జ‌ల‌ను న‌మ్ముకుంటేనే పార్టీల‌కు మ‌నుగ‌డ ఉంటుంద‌నే విష‌యం కొత్తగా ఎవ‌రూ చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే.. ఈ విష‌యంలో అధికార ప‌క్షం వైసీపీ వైఖ‌రి ఒక‌విధంగా ఉంటే.. ఈ పార్టీని ఓవ‌ర్ టేక్ చేయాల‌ని భావిస్తున్న టీడీపీ మాత్రం మ‌రో పంథాను ఎంచుకుంది. ఇది.. రాజ‌కీయంగా స్పీడుకు బ్రేకులు వేస్తోంద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

2019లో టీడీపీ ఘోర ప‌రాజ‌యం పాలైంది. అప్ప‌ట్లోనే పార్టీ పురోగ‌తిపై దృష్టి పెడ‌తామ‌ని సంక‌ల్పించిన‌ టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. కొన్నాళ్ల త‌ర్వాత‌.. ష‌రా మామూలే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు.. అదే స‌మయంలో పార్టీలో కొన్నాళ్ల కింద‌ట ప‌ద‌వులు పంచినా.. వాటిని వార‌సుల‌కు… సిఫార‌సు నేత‌ల‌కు మాత్ర‌మే కేటాయించారు. ఇది పార్టీలో ఇబ్బందిక‌ర ప‌రిణామంగా మారిపోయింది. ఇక‌, వైసీపీని తీసుకుంటే.. కింది స్థాయిలో సామాజిక వ‌ర్గాల వారీగా జ‌గ‌న్ చేస్తున్న సోష‌ల్ ఇంజ‌నీరింగ్ వ‌ర్క‌వుట్ అవుతోంది.

పార్టీ ప‌ద‌వులు, అధికారిక ప‌ద‌వులు, టికెట్ల విష‌యంలో అట్ట‌డుగు వ‌ర్గాల వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు.. ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు, అందునా.. అట్ట‌డుగు వ‌ర్గాల వారికి ప్రాధాన్యం ఇస్తుండ‌డం.. ఒక విధ‌మైన జోష్ పెంచుతోంది. ఇక‌, పార్టీ వ్యూహాల విష‌యంలోనూ.. జ‌గ‌న్ త‌ర‌హా వ్యూహాల‌ను అనుస‌రించ‌డంలో టీడీపీ వెనుక‌బ‌డింది. కేవ‌లం మీడియాను న‌మ్ముకుని ముందుకు సాగుతోంద‌నే టీడీపీపై ఉన్న విమ‌ర్శ నేటికీ అలానే ఉంది. మీడియాలో నాలుగు వార్త‌లు రాగానే.. సంబ‌ర ప‌డి.. పార్టీ పుంజుకుంద‌నే భావ‌న టీడీపీలో వ్య‌క్త‌మ‌వుతోంది.

వాస్త‌వానికి ఏపీ ప్ర‌జ‌లు మీడియా ఆధారంగా తీర్పులు చెప్ప‌ర‌ని.. ఎన్నిక‌ల్లో ఫ‌లితాల‌ను ఇవ్వ‌ర‌ని.. 2019 ఎన్నిక‌ల్లోనే స్ప‌ష్ట‌మైంది. జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా కొన్ని మీడియా వ‌ర్గాలు విస్తృత వ్య‌తిరేక ప్ర‌చారం చేసినా.. చంద్ర‌బాబుకు అనుకూలంగా రాసినా.. ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.. ఇక‌, ఇటీవ‌ల స్థానిక ఎన్నిక‌ల్లోనూ ఇదే త‌ర‌హా వ్యూహం సాగినా.. ఫ‌లితం ఏమైందో తెలుస్తూనే ఉంది. నిజానికి ఇలాంటి మీడియా మేనేజ్ మెంట్ ఒక‌ప్పుడు స‌క్సెస్ అయితే అయి ఉండొచ్చు.

కానీ, నేడు మారిన మాధ్య‌మాలు, సోష‌ల్ మీడియా ప్ర‌భావం.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌పై ప్ర‌జ‌ల‌కు పెరుగుతున్న ప‌ట్టు వంటి కార‌ణాల నేప‌థ్యంలో మూస విధానం నుంచి పార్టీలు బ‌య‌ట‌కు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అయితే.. టీడీపీ ఆ త‌ర‌హా మార్పు అందిపుచ్చుకోలేక పోతోంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా.. పార్టీలో స‌మూల మార్పుల దిశ‌గా అడుగులు ప‌డితేనే పార్టీ అనుకున్న రేంజ్‌లో పుంజుకుంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు..