తొందరలోనే రాజకీయపార్టీ పెట్టబోతున్న షర్మిల ప్రధానంగా మూడు నియోజకవర్గాలపైనే దృష్టి పెట్టినట్లు సమాచారం. నిజనికి రాజకీయపార్టీనే ఇంకా షర్మిల పెట్టలేదు. ఇలాంటి సమయంలో ఆమె ఎక్కడి నుండి పోటీ చేస్తుందనే విషయంపై చర్చలు జరగటమంటే కాస్త విడ్డూరంగానే అనిపిస్తుంది. కానీ ఆమె ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తే బాగుంటుందనే విషయమై షర్మిలతో కొందరు సన్నిహితులు ఇఫ్పటకే ప్రస్తావన తెచ్చిందైతే వాస్తవం.
అందుకనే షర్మిల పోటీ చేయటానికి పరిశీలనలో ఉన్న నియోజకవర్గాలంటు మూడింటిపై చర్చలు జరుగుతున్నాయి. అవేమిటంటే మొదటిది సికింద్రాబాద్ నియోజకవర్గం. ఇక్కడే ఎందుకంటే ఈ నియోజకవర్గంలో క్రిస్తియన్ మైనారిటీలు బాగా ఎక్కువగా ఉన్నారు. అలాగే మెజారిటి ఓట్లు సీమాంధ్రులవే. ఈ కారణంతోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో సినీనటి జయసుధ సికింద్రాబాద్ నుండే పోటీచేసిన విషయం గుర్తుండే ఉంటుంది.
ఇక మిగిలిన రెండు నియోజకవర్గాలు పాలేరు, ఖమ్మం. రెండు కూడా ఖమ్మం జిల్లాలోనివే. రెండు నియోజకవర్గాల్లోను సీమాంధ్రుల ప్రభావం చాలా ఎక్కువనే చెప్పాలి. నిజానికి జిల్లా మొత్తం మీద తెలంగాణా ప్రభావం చాలా తక్కువనే చెప్పాలి. అందుకనే కేసీయార్ కూడా ఈ జిల్లా గురించి చాలాకాలం పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఈ జిల్లాలో వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులు చాలా ఎక్కువమందున్నారు.
2014లో జగన్మోహన్ రెడ్డి ప్రచారంతో సంబంధం లేకుండానే ఖమ్మం ఎంపితో పాటు మూడు అసెంబ్లీ నియజకవర్గాల్లో వైసీపీ గెలవటం సంచలనమైంది. వైఎస్ పై ఇంతటి ఆధరణ ఉన్న జిల్లాలోనే షర్మిల పోటీ చేస్తే గెలుపు ఖాయమని కొందరు ఇప్పటికే సూచించారట. కాబట్టి షర్మిల కూడా ఇదే విషయమై ఆలోచిస్తున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates