ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఘోర పరాజయం పాలైంది. ఇది ఊహించని పరిణామం. మరీ ముఖ్యంగా చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి మరీ.. విశాఖ, విజయవాడ, గుంటూరు వంటి ప్రధాన కార్పొరేషన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేశారు. అయిన ప్పటికీ.. సైకిల్‌కు పంక్చర్లు తప్పలేదు. ఇక, ఇప్పుడు వచ్చిన కీలక ఎన్నిక.. తిరుపతి. ఇక్కడ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అయితే.. ఇక్కడ గెలిచేందుకు ఉన్న అన్నిమార్గాలను బాబు అన్వేషిస్తున్నారని సమాచారం.
అయితే.. ఇంతలోనే ఒక సంచలన విషయం వెలుగు చూసింది. బాబు సామాజికవర్గం సహా.. ఆయన అనుకూల మీడియా చిత్రమైన ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం బీజేపీతో ఉన్న జనసేనానిని తిరిగి తీసుకు వచ్చి.. సైకిల్ ఎక్కించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ ప్రతిపాదన ఇప్పటికే చర్చల స్థాయికి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా జరిగిన స్థానికంలో జనసేన, టీడీపీ రెండు నష్టపోయాయి. జనసేన బీజేపీతో కలిసి ముందుకు సాగినా.. ఫలితం దక్కలేదు. ఇక, ఒంటరిగా బరిలో నిలిచిన టీడీపీ కూడా నష్టపోయింది.
ఇక, వైసీపీ ఓట్ షేర్ చూస్తే.. టీడీపీకి రెండు రెట్లు అన్నట్టుగా వచ్చింది. అయితే.. టీడీపీ జనసేన రెండు కలిస్తే.. మాత్రం వైసీపీ ఓట్ షేర్ కన్నా ఎక్కువ. దీంతో ఈ రెండు పార్టీలు మళ్లీ చేతులు కలిపితే.. బలమైన అధికార పక్షాన్ని దెబ్బతీసేందుకు అవకాశం ఉందని.. భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. బహుశ.. ఈ ప్రతిపాదన.. కొన్నాళ్లుగా నలుగుతోందని కూడా తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో ఫలతాలు వచ్చిన తర్వాత.. టీడీపీ నుంచి ఈ ప్రతిపాదన పుంజుకున్నట్టు సమాచారం.
ఇక పవన్ కూడా బీజేపీపై గుర్రుగానే ఉన్నాడు. అంటే.. రేపు బీజేపీతో కటీఫ్ చేసుకునే పవన్ వెంటనే..రాష్ట్ర ప్రయోజనాల కోసం..అని చెప్పి.. సైకిల్ ఎక్కేందుకు ప్రయత్నాలు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితిలో చంద్రబాబుకు కూడా కావాల్సింది ఇదే. అంటే.. తిరుపతి ఎన్నికల్లోనే జనసేనతో జట్టు కట్టి.. గెలుపు గుర్రం ఎక్కి.. స్థానిక అవమానం నుంచి బయట పడాలని బాబు కూడా భావిస్తున్నారు. దీనిపై రెండు మూడు రోజుల్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. మరి ఇదే జరిగితే.. వైసీపీ గెలుపు కోసం చెమటోడ్చక తప్పని పరిస్థితి.