విశాఖలో సీన్ రివర్స్.. కారకులెవరు?

అన్ని అనుకున్నట్లు జరిగితే.. విశాఖపట్నం ఏపీకి కాబోయే రాజధాని. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉక్కునగరాన్ని ఏపీ రాజధానిగా చేయాలని బలంగా కోరుకోవటం తెలిసిందే. ఆందోళనలు.. నిరసనలు.. విమర్శల్ని లైట్ తీసుకొని మరీ.. తాను అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేయటానికి తెగ ప్రయత్నిస్తున్నారు. తాజాగా వెల్లడైన మున్సిపల్ ఫలితాలు ఆయన రాజధాని కలను నెరవేర్చేలా చేయటమే కాదు.. విశాఖ వైసీపీ నేతల లోగుట్టును బయటపడేలా చేశాయన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. వెల్లడైన ఫలితాల్ని చూస్తే.. వైసీపీ బలంగా ఉన్న చోట తక్కువ ఓట్లు.. టీడీపీ బలంగా ఉన్న చోట ఎక్కువ సీట్లు రావటం ఆసక్తికరంగా మారింది.

విశాఖ మహానగరంలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిని విశాఖ తూర్పు.. పశ్చిమ.. ఉత్తర.. దక్షిణాలుగా విభజిస్తే..విశాఖను అనుకొని ఉండే భీమిలి.. పెందుర్తి.. అనకాపల్లి ప్రాంతాలు పాక్షికంగా కొంతే ఉన్నాయి. నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాసుపల్లి టీడీపీ నుంచి ఎన్నికైనా.. వైసీపీ గూటికి చేరటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. విశాఖలోని నాలుగు దిక్కులా నాలుగు రకాలైన ఫలితాలు రావటమే కాదు.. ఎవరికెంత బలం ఉందన్న విషయం తాజాగా అర్థమైంది. విశాఖ తూర్పు వైపు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి పన్నెండేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఆయన పరిధిలో మొత్తం 15 వార్డులు ఉంటే.. వైసీపీకి తొమ్మిది.. టీడీపీకి 3.. జనసేనకు ఒకటి గెలవగా.. స్వతంత్ర అభ్యర్థి మరో స్థానంలో గెలిచారు. వైసీపీ నుంచి వచ్చి జనసేనలో చేరి గెలిచారు. పశ్చిమంలో టీడీపీ ఎమ్మెల్యే పెతకం శెట్టి గణబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడున్న 14 వార్డుల్లో టీడీపీకి ఐదు.. వైసీపీకి తొమ్మిది వార్డుల్లో గెలిచారు. ఉత్తరం విషయానికి వస్తే.. మాజీ మంత్రి గంటా టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గడిచిన పద్దెనిమిది నెలలుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. మొత్తం 17 వార్డులు ఉంటే.. వైసీపీ 15.. టీడీపీ ఒకటి.. బీజేపీ ఒకటి చొప్పున గెలిచారు. దీంతో.. గంటాకు భారీ షాక్ తగిలినట్లైంది.

విశాఖ దక్షిణం విషయానికి వస్తే.. ఇక్కడున్న మొత్తం 13 వార్డుల్లో వైసీపీకి ఐదు వార్డులు.. టీడీపీకి నాలుగు వార్డులు జనసేన నుంచి ఒకరు.. స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు గెలిచారు. వీరంతా వైసీపీ రెబెల్స్ కావటం గమనరా్హం. వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి చేసిన కంగాళీతోనే ఇలాంటి పరిస్థితిగా చెబుతున్నారు. గాజువాకలో 17 స్థానాలు ఉంటే.. వైసీపీకి ఏడు స్థానాలు వస్తే.. టీడీపీకి ఏడు.. టీడీపీ బలపర్చిన సీపీఐ అభ్యర్థి కూడా గెలుపొందారు. సీపీఎం కూడా ఒక స్థానాన్ని కైవశం చేసుకున్నారు. జనసేన ఒక వార్డులో విజయం సాధించింది.

పెందుర్తిలో వైసీపీ ఎమ్మెల్యే ఆదీప్ రాజ్ కీలకంగా వ్యవహరించారు. ఇక్కడ జీవీఎంసీలో ఆరు వార్డులు ఉంటే.. టీడీపీ ఐదింటిలోనే వైసీపీ ఒక్క వార్డులో వైసీపీ విజయం సాధించింది. టీడీపీ మాజీ మంత్రి సత్యనారాయణ మూర్తి ఇన్ చార్జ్ గా వ్యవహరించటంతో ఇలాంటి పరిస్థితి ఉందని చెబుతున్నారు. అనకాపల్లిలో ఐదు వార్డుల ఉంటే.. వైసీపీ నాలుగు గెలుచుకుంటే.. టీడీపీ ఒకటి దక్కించుకున్నారు. అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ పని తీరుతోనే ఇన్నిసాట్లు సాధించినట్లు చెబుతున్నారు. మొత్తంగా విశాఖ మహానగరంలో స్థానిక నేతల నాయకత్వం పార్టీకి వచ్చే సీట్లపై ప్రభావం చూపినట్లుగా విశ్లేషిస్తున్నారు.