క‌మ‌లంతో తెగ‌తెంపుల దిశ‌గా ప‌వ‌న్‌… మ‌ళ్లీ బాబుతో దోస్తానా ?

క‌మ‌లంతో ప‌వ‌న్ ప్ర‌యాణం ముగిసిందా ? బీజేపీని ప‌వ‌న్ వ‌దిలించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారా ? ఆదివారం జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సాక్షిగా ప‌వ‌న్ తెలంగాణ బీజేపీపై విరుచుకు ప‌డ‌డంతో పాటు టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పోటీ చేసిన మాజీ ప్ర‌ధాన‌మంత్రి పీవీ కుమార్తె సుర‌భివాణికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఎన్నికల రోజే ప‌వ‌న్ బీజేపీకి షాక్ ఇవ్వ‌డంతో ఆ పార్టీ వ‌ర్గాలు జీర్ణించుకోలేక‌పోతున్నాయి. సో దీనిని బ‌ట్టి తెలంగాణ‌లో బీజేపీతో ప‌వ‌న్ దాదాపు అధికారికంగానే తెగ‌తెంపులు చేసుకున్న ప‌రిస్థితే ఉంది. ఆ మాట‌కు వ‌స్తే తెలంగాణ బీజేపీ వాళ్లు కూడా ప‌వ‌న్‌ను చాలా లైట్ తీస్కొన్నారు.

తెలంగాణ‌లో తెగిన బంధం ఏపీలో కంటిన్యూ అవుతుంద‌ని కూడా ఆశించ‌లేం. పైగా ఏపీలో చాలా చోట్ల జ‌న‌సేన – టీడీపీతో పొత్తు పెట్టుకుని స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేసింది. బీజేపీతో వెళ్ల‌డం వ‌ల్ల ఉప‌యోగం లేద‌ని కూడా జ‌నసేన స్థానిక కేడ‌ర్ డిసైడ్ అయ్యింది. ఆ మాట‌కు వ‌స్తే 2014లో బీజేపీకి సోపోర్ట్ చేసిన ప‌వ‌న్ ఆ త‌ర్వాత క‌టిఫ్ చేసుకుని గ‌త ఎన్నిక‌ల్లో ఒంట‌రి పోరు చేశారు. మ‌ళ్లీ మెన్నెన్నిక‌లు అయిన వెంట‌నే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఏపీలో క్షేత్ర‌స్థాయిలో బీజేపీతో పోలిస్తే ప‌వ‌న్‌కే ఎంతో బ‌లం ఉంది. అయినా ప‌వ‌న్‌ను ఆ పార్టీ జాతీయ నాయ‌క‌త్వం కాని.. ఇక్క‌డ ఏపీ నాయ‌క‌త్వం కాని పూచిక పుల్ల తీసిన‌ట్టు తీసి ప‌డేస్తున్నారు.

ఇక ఏపీలో జ‌న‌సేన + టీడీపీ పొత్తు ఫ‌లించ‌డంతో అటు టీడీపీ సైతం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీతోనే క‌లిసి ముందుకు వెళ్లాల‌ని దాదాపు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టే తెలుస్తోంది. స‌ర్పంచ్‌, మునిసిప‌ల్ ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీ నేత‌లు సైతం బాబుకు జ‌న‌సేన‌తో క‌ల‌వ‌క‌పోతే మ‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ గెలుపు ఉండ‌ద‌ని చెప్పేశారు. ఇక దీనిపై అటు అధికార వైసీపీ సైతం విమ‌ర్శ‌లు స్టార్ట్ చేసింది. బీజేపీని పవన్ కళ్యాణ్‌ వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు.. తిరిగి చంద్రబాబు పంచన చేరే ప్రయత్నం జరుగుతోంద‌ని కూడా మంత్రి కొడాలి నాని చెప్పారు.

ఇక ఏపీలో జ‌న‌సేన తిరుప‌తి పార్ల‌మెంటు సీటు కోసం ఎన్నో ప్ర‌యత్నాలు చేసింది. అయినా బీజేపీ ఎత్తుల ముందు త‌ల‌వంచ‌క త‌ప్ప‌లేదు. చివ‌ర‌కు ప‌వ‌న్ తిరుప‌తి సీటు బీజేపీకే వ‌దులుకున్నారు. ఈ ప‌రిణామాల‌న్ని చూస్తుంటే ప‌వ‌న్ మ‌ళ్లీ సైకిల్ ఎక్కి… చంద్ర‌బాబుతో జ‌ట్టుక‌ట్టే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది.