మద్యం షాపులపై మళ్లీ కోత !

తాను అధికారంలోకి వచ్చిన వెంటనే దశలవారీగా మద్యపాన నిషేధం విధిస్తానని నాటి ప్రతిపక్ష నేత, నేటి ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న జగన్….కొద్ది నెలల క్రితమే ఏపీలోని 20 శాతం మద్యం షాపులను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాదు, ఏపీలో మద్యం ధరలను పెంచి తద్వారా మద్యం వినియోగాన్ని తగ్గించారు. ఇక, తాజాగా ఏపీలో మద్యపాన నిషేధం దిశంగా మరో అడుగు వేసింది. తాజాగా మరో 13 శాతం మద్యం షాపులను తొలగించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. మే 31 నాటికి షాపులను తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో ఏపీలో మొత్తం 33 శాతం మద్యం షాపులు తొలగించినట్లయింది.

గతంలో ఉన్న 4380 మద్యం షాపులను 2934కి తగ్గించింది. 43వేల బెల్టు షాపుల తొలగింపుతోపాటు, 40 శాతం బార్లను గతంలోనే ప్రభుత్వం తగ్గించింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకూ మాత్రమే మద్యం అమ్మకాలు జరపాలని నిబంధన విధించింది. కాగా, కరోనా విపత్తు సమయంలోనూ మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది.

మే 4 నుంచి ఏపీలో మద్యం ధరలను 25 శాతం పెంచిన ఏపీ ప్రభుత్వం…ఆ తర్వాత మరో 50 శాతం పెంచింది. మద్యం వాడకాన్ని తగ్గించేందుకు మొత్తంగా ధరలను 75 శాతం పెంచింది. ధరలను అమాంతం పెంచినప్పటికీ ఏపీలోని వైన్ షాపుల ముందు ప్రజలు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు.

కాగా, ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాలను మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్‌ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం….సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టింది.