ఇదే అర్ధం కావటంలేదు జనసేన అభిమానులకు. తొందరలోనే జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో మిత్రపక్షమైన బీజేపీ తరపున అభ్యర్ధి పోటీ చేస్తున్న విషయం ఖాయమైపోయింది. ఈ విషయాన్ని స్వయంగా పవనే ప్రకటించటంతో ఇక అయోమయానికి చోటు లేకపోయింది. కానీ ఇంతకాలం ఉపఎన్నికలో తమ పార్టీనే పోటీ చేయాలని పట్టుబట్టిన పవన్ చివరకి వచ్చేసరికి ఎందుకని పోటీ అవకాశం మిత్రపక్షానికి వదిలేశారు ?
నిజానికి తిరుపతి లోక్ సభ ఎన్నికలో మిత్రపక్షాల్లో ఏ పార్టీ పోటీ చేసిన ఒరిగేదేమీలేదు. ఎందుకంటే సాధారణంగా ఉప ఎన్నికలు అధికార పార్టీ గాలితో గెలుస్తుంటాయి. ఒకవేళ కాదనుకున్నా… రెండో స్థానంలో నిలబడిన టీడీపీ కూడా ఉంది. ఈ రెండూ కాదని బీజేపీ-జనసేన ఇక్కడ ఇపుడు గెలిచే అవకాశాలు చాలా తక్కువ. అసలు 2019లో కూడా అదే జరిగింది. మరి వాస్తవాన్ని మరచిపోయి రెండుపార్టీలూ దేనికదే తమ స్ధాయికి మించి తమను తాము ఊహించుకున్నాయి. దానివల్లే పోటీలో ఉండబోయేది తామంటే తామని పోటీపడ్డాయి. మొత్తానికి తెరవెనుక ఏమి జరిగిందో కానీ పోటీ చేసే అవకాశం బీజేపీకి వదిలేశారు పవన్.
అంత ఈజీగా పోటీచేసే అవకాశం బీజేపీకి ఎందుకు వదిలేసినట్లు ? ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కారణంగా జనాల్లో మంట పెరిగిపోతోంది. తాజాగా విశాఖ స్టీల్స్ ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న కేంద్ర నిర్ణయంపై ఎంతలా ఆందోళన జరుగుతోందో అందరికీ తెలిసిందే. ఈ పరిస్దితుల్లో రాష్ట్రంలో ఎక్కడ ఎన్నిక జరిగినా బీజేపీ అడ్రస్ గల్లంతే అన్నది వాస్తవం. ఈ విషయంలో బీజేపీ కన్నా పవన్ కాస్త ముందుగానే వాస్తవాన్ని గ్రహించినట్లున్నారు.
ఇదే సమయంలో బీజేపీని కాదని తమ పార్టీ పోటీచేస్తే ఆర్ధికంగా చాలా నష్టపోవాల్సుంటుందని కూడా పవన్ కు రిపోర్టు అందిందట. ఎందుకంటే బీజేపీకి మిత్రపక్షంగా జనసేన కూడా పెద్ద మూల్యమే చెల్లించాల్సుంటుందని అర్ధమైపోయింది. ఇలాంటి అనేక కారణాల వల్ల తాను బెట్టు చేసినట్లు యాక్ట్ చేసి చివరలో బీజేపీ ఒత్తిడికి లొంగిపోయి పోటి చేసే అవకాశం వదులుకున్నట్లు పవన్ నటించినట్లున్నారు. మొత్తానికి పవన్ ఏ ఉద్దేశ్యంతో పోటీ నుండి తప్పుకున్నా తమ ఆగ్రహం ఏ స్ధాయిలో ఉందో చెప్పటానికి జనాలకు ఓ అవకాశం వచ్చినట్లయ్యింది. ఏది ఏమైనా పవన్ తీసుకున్నది తాత్కాలికంగా జన సైనికులకు కోపం తెప్పించే నిర్ణయం అయినా… పవన్ కి మాత్రమే మేలు చేసే నిర్ణయమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates