తుమ్మల నాగేశ్వరరావు. ఒకప్పుడు ఖమ్మం జిల్లాను శాసించిన ఆయన ఇప్పుడు ఎటూ కాకుండా పోతున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. టీడీపీలో సీనియర్ నాయకుడిగా కమ్మ సామాజిక వర్గంలో తనకంటూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈయన అనంతర కాలంలో తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్లోకి చేరిపోయారు. ఈ క్రమంలోనే ఉప ఎన్నికల్లో పాలేరు నుంచి విజయం సాధించి.. మంత్రి పదవిని సైతం సొంతం చేసుకున్నారు. అయితే.. టీఆర్ఎస్లో తనకంటూ.. వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం, సీఎం కేసీఆర్‌కు మాత్రమే చేరువ కావడం వంటివి తుమ్మలకు మైనస్‌గా మారింది. యువ నాయకుడు.. పార్టీలో నెంబర్ 2గా ఉన్న కేటీఆర్‌కు తుమ్మలకు మధ్య అభిప్రాయ బేదాలు ఉన్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలోనే పువ్వాడ అజయ్‌ను పార్టీలోకి తీసుకున్నారు. 2018 ఎన్నికల్లో తుమ్మల ఓటమి పాలవడం మరింతగా ఆయన రాజకీయాలపై ప్రభావం చూపించింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే .. ఇటీవల ఆయన ఏపీ బీజేపీకి చెందిన కీలక నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, మాజీ టీడీపీ నేతను రహస్యంగా కలు సుకోవడం అనేక చర్చలకు అవకాశం ఇచ్చింది. ఆయన పార్టీ మారుతున్నారని.. త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని తెలంగాణలో ప్రచారం జరుగుతోంది. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. గత ఎన్నికలలో ఓడిపోయిన తుమ్మలకు ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు. ఈ క్రమంలో కొన్నాళ్ల కిందట ఎమ్మెల్సీ ఇచ్చేందుకు ఆయన ప్రయత్నించారు.
అయితే.. దీనికి కేటీఆర్ అడ్డు పడ్డారనే ప్రచారం ఉంది. దీంతో అప్పటి నుంచి కేసీఆర్.. తుమ్మలను దూరం పెట్టారు. అదే సమయంలో తుమ్మలకు బద్ధ శత్రువుగా ఉన్న పువ్వాడకు ప్రాధాన్యం పెంచారు. ఇక, తుమ్మల రాజకీయాలను డైల్యూట్ చేసేందుకు.. పువ్వాడ.. ఆయన వర్గాన్ని తనవైపు తిప్పుకోవడంతోపాటు.. తుమ్మల వర్గానికి పనులు చేయించకుండా అడ్డు పడుతున్నారనే వాదన కూడా ఉంది.
ఈ నేపథ్యంలో ఇంకా కేసీఆర్‌ను నమ్ముకుని ఉంటే.. కష్టమనే భావన తుమ్మల వర్గంలో వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పుంజుకోవాలంటే.. ఇప్పుడున్న రాజకీయాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని కొన్నాళ్లుగా ఆయన వర్గం చెబుతోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీతో ఆయన రహస్యంగా బేటీ అయ్యారని అంటున్నారు. మరి ఇదే జరిగితే.. తుమ్మల రాజకీయ మార్పు అనివార్యంగా మారే అవకాశం ఉందని టాక్. మరి ఏం జరుగుతుందో చూడాలి.